కొయ్యూరు (పాడేరు): మహిళ పీకను బ్లేడ్‌తో కోసి చంపేశారు.. ముఖం నల్లగా మాడిపోవడంతో కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు.. మృతదేహం పడివున్న తీరును బట్టి మొదట అత్యాచారం చేసి తరువాత హత్య చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. డౌనూరు–రొబ్బసింగి దారిలో జీడితోటల పక్కన బుధవారం ఉదయం మహిళ మృతదేహం దొరికిన సంఘటన కలకలం సృష్టించింది. మృతురాలి వయసు సుమారు 33 సంవత్సరాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. డి.ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన జీడిమామిడి తోటలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన తోటలో మృతదేహం ఉన్నట్టు ఆయనే కొయ్యూరు పోలీసులకు సమాచారం అందించారు. అనకాపల్లి డీఎస్‌పీ రమణ, కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్, ఎస్‌ఐ రుక్మాంగదరావు మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.
గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం
హత్యకు గురైన మహిళ గుర్తుపట్టలేని విధంగా ఉంది. ముఖం పూర్తిగా మాడిపోవడంతో స్థానికులు ఆమె ఎవరో కనుక్కోలేకపోయారు. మొదట మహిళను అత్యాచారం చేసి తరువాత బ్లేడ్‌తో పీక కోసి చంపేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో వాస్తవాలు తేలాల్సి ఉంది. మృతదేహానికి సమీపంలో ఒక బీరు సీసా, దగ్గరలో ఒక లిమ్కా ఖాళీ సీసా, దూరంగా రెండు ధమ్స్‌ఆప్ సీసాలున్నాయి. రెండు ప్లాస్టిక్ గ్లాసులు దొరికాయి. పథకం ప్రకారం మహిళను అక్కడకు తీసుకువచ్చి అత్యాచారం చేసి తరువాత చంపినట్టుగా అనుమానిస్తున్నారు. మహిళ హత్యలో ఇద్దరు లేదా ముగ్గురు పాల్గొని ఉండవచ్చని చెబుతున్నారు. డౌనూరుకు ఫర్లాంగు దూరంలో ఈ హత్య జరిగింది.
రెండు రోజుల కిందట ఈ సంఘటన జరిగి ఉంటుందని కొయ్యూరు సీఐ ఉదయ్‌కుమార్ బుధవారం రాత్రి విలేకరులకు తెలిపారు. మహిళ చిలకపచ్చరంగు చీరను ధరించింది. రెండు కాళ్లకు కడియాలున్నాయి. కాలి వేళ్లకు మట్టెలుండడంతో ఆమె వివాహిత అని నిర్ధారణకు వచ్చారు. మృతురాలు మైదాన ప్రాంతానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. బు«ధవారం సాయంత్రం సంఘటన స్థలానికి క్లూస్ టీమ్ వచ్చింది. అన్ని వైపుల పరిశీలన చేసింది. వివరాలను సేకరించింది. అనంతరం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పోస్టుమార్టంలో తెలుస్తుంది
మహిళను హత్య చేయడానికి ముందు అత్యాచారం జరిగిందీ లేనిదీ పోస్టుమార్టంలో తేలుతుందని సీఐ ఉదయ్‌కుమార్ అన్నారు. గురువారం పోస్టుమార్టం నిర్వహిస్తారన్నారు. హత్య జరిగి రెండు రోజులు కావడంలో ముఖం నల్లగా మాడిపోయిందని తెలిపారు. బ్లేడ్‌తో పీక కోయడంతో ముఖం నల్లగా మాడిందని చెప్పారు. ముఖాన్ని కాల్చినట్టుగా కనిపించడం లేదన్నారు. కాళ్లకు కడియాలు ఉన్నాయన్నారు. హత్యకు కారణం తెలియకపోయినా మద్యం సీసాల ఆధారంగా అక్కడ వివాదం జరిగినట్టుగా తెలుస్తుందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. జిల్లాలో ఎక్కకైనా అదృశ్యం కేసులు నమోదై ఉన్నాయేమో పరిశీలిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment