సాక్షి, కృష్ణా: ఎన్నారై భర్త మోసం చేయడంతో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. రెండో పెళ్లి చేసుకుని విదేశాలకు పారిపోతున్న అతడిని ఎలాగైనా అడ్డుకోవాలని స్టేషను దగ్గర ఆందోళనకు దిగింది. వివరాలు... కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన అనూష అనే మహిళకు 2015 అక్టోబరులో మధు అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ క్రమంలో వీరిరువురు కొంతకాలం మలేషియాలో కాపురం ఉన్నారు. ఆ తర్వాత అనూషను వదిలించుకోవాలనే ఉద్దేశంతో మధు ఆమెను అక్కడే వదిలేసి ఇండియాకు తిరిగివచ్చేశాడు. ఈ నేపథ్యంలో తనకు అన్యాయం జరిగిందని గుర్తించిన అనూష అత్తింటికి చేరుకుని భర్తను నిలదీసింది. దీంతో అదనపు కట్నం తేవాలంటూ అత్తింటి వారు ఆమెను వేధించారు. అనూష మరిది రాజేశ్ ఏకంగా వదిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భర్త మధు మీద అనూష గతంలో కేసు పెట్టింది.
ఇదిలా ఉండగా మధు మరో మహిళను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని అనూష స్థానిక పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేసింది. రెండో భార్యతో పెనుగంచిప్రోలు ఆలయంలో పూజలు చేస్తుండగా తమ బంధువులు వీడియోలు తీశారని పేర్కొంది. వారిద్దరూ కలిసి జర్మనీకి వెళ్లేందుకు వీసా కూడా రెడీ చేసుకొన్నారని ఆరోపించింది. పోలీసు కేసు నడుస్తుండగా వీసాకు క్లియరెన్స్ ఎలా వచ్చిందో అర్థంకావడం లేదని అనూష వాపోయింది. మరోవైపు అనూష భర్త మధు మాత్రం తనకు ఎవరితోనూ వివాహేతర సంబంధం లేదని... భార్య ఆరోపిస్తున్నట్లుగా సదరు అమ్మాయి తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే అని పేర్కొన్నాడు. ఇక మధు తల్లిదండ్రులు అనూష కేవలం అనుమానంతో ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment