సాక్షి, కందుకూరు : భర్తను తనకు కాకుండా చేస్తున్నారంటూ ఓ యువతి రోడ్డుపై ఆందోళనకు దిగింది. ఈ సంఘటన గురువారం స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకు వద్ద జరిగింది. బాధిత యువతి కథనం ప్రకారం... చీరాలకు చెందిన హేమకు కందుకూరు పట్టణానికి చెందిన శ్రీమన్నారాయణ అలియాస్ శివతో మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందు నుంచే శివకు స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే భూలక్ష్మి అనే యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శివ తనను మోసం చేశాడంటూ హేమ కేసు కూడా పెట్టింది.
ఈ కేసులో శివ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి మళ్లీ భూలక్ష్మితోనే సహజీవనం చేయడం ప్రారంభించాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న హేమను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. హేమ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే తన భర్తను తనకు కాకుండా చేస్తోందంటూ ఆమె గురువారం స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకుకు వెళ్లి భూలక్ష్మితో వాదనకు దిగింది. అనంతరం బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టింది. తన భర్తను వలలో వేసుకుని ఇంటికి రాకుండా చేస్తోందని, పెళ్లి చేసుకోకుండా ఎలా కలిసి ఉంటారని నిలదీసింది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతికి నచ్చజెప్పారు. పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే పిలిపించి మాట్లాడతామని సర్ది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment