దాని కోసం పేద, మధ్య తరగతి మహిళలే టార్గెట్‌ | Women in Gold And Drugs Smuggling | Sakshi

అనుమానం రావొద్దని!

Jun 4 2019 10:39 AM | Updated on Jun 6 2019 10:28 AM

Women in Gold And Drugs Smuggling - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: స్మగ్లింగ్‌ చేసేందుకు ప్రధాన సూత్రధారులు మహిళలను క్యారియర్లుగా నియమించుకుంటున్నారు. కస్టమ్స్‌ అధికారులు మహిళలపై ఎక్కువగా దృష్టిసారించరనే ఉద్దేశంతోనే వారిని వినియోగించుకుంటున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయ్‌ నుంచి రూ.3.62 కోట్ల విలువైన బంగారంతో వస్తూ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల చిక్కిన జియా ఉన్నిసా ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ప్రధాన సూత్రధారులైన స్మగ్లర్ల తరఫున  ఈమె క్యారియర్‌గా పని చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్‌ చేస్తూ 9 మంది మహిళలు పట్టుబడ్డారు. సాధారణంగా స్మగ్లర్లు అనగానే అందరి మదిలో మెదిలేది పురుషులే. దీనికి తోడు మహిళలూ.. అందునా గర్భంతో, పసి పిల్లలతో వచ్చే వారిని అధికారులు తక్కువగా అనుమానిస్తారు. దీంతో దుబాయ్‌ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్‌ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్‌ మాట అటుంచితే మహిళా క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే పసిడి ఇచ్చి పంపుతున్నారు. మాదకద్యవాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి ఇచ్చి పంపిస్తున్నారు.

డీఎఫ్‌ఎండీల వద్దా బురిడీ..
వివిధ రూపాల్లో, వివిధ పంథాల్లో దుస్తుల్లో దాచుకుని బంగారం తీసుకొస్తున్న మహిళలను విమానాశ్రయాల్లోని డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్స్‌ (డీఎఫ్‌ఎండీ)లు కూడా కొంత వరకు సహకరిస్తున్నాయి. ఏదైనా అక్రమరవాణా విషయం కస్టమ్స్‌ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకారం చేస్తాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన లోహాలను గుర్తించి డీఎఫ్‌ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంతవరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం ఉంటుంది. అందుకే బడా స్మగ్లర్లు మహిళల్ని క్యారియర్లుగా వాడుకుంటున్నారు.

ముమ్మర కసరత్తు
బడా స్మగ్లర్లు మహిళల్ని అక్రమరవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళలను ఆపడం, క్షుణ్నంగా తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్‌ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఆఖరిసారి ఎప్పుడు వచ్చారు? ఏ వీసాపై వెళ్లారు.. వారి నేపథ్యం ఏంటి.. తదితరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు మహిళా క్యారియర్లు కస్టమ్స్‌ కన్నుగప్పి తప్పించుకుంటున్నారు. జియా ఉన్నిసా సైతం ఎగ్జిట్‌ గేటు వరకు వచ్చేశాక ముందే సమాచారం ఉన్న డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు.

కీలక వ్యక్తులు చిక్కడం కష్టమే
ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా... ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్‌ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండాలనో.. పలానా హోటల్‌/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. అయితే జియా ఉన్నిసా వ్యవహారాన్ని మాత్రం అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెను ఓ స్టార్‌ హోటల్‌లో ఉంచి మరీ ఈ వ్యవహారం సాగిస్తుండటంతో సూత్రధారుల్ని గుర్తించే పనిలో పడ్డారు.

4కేజీలుబ్యాంకాక్,దుబాయ్‌ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు వారి నుంచి 4 కేజీలబంగారం స్వాధీనం చేసుకున్నారు.
793గ్రాముల కొకైన్‌దుబాయ్‌ నుంచి గర్భవతిగా వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది.

ఉదాహరణలు ఎన్నో..ళీ    సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలసి వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది.
♦ సింగపూర్‌ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
♦ యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల వద్ద నుంచి 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement