అనంతసాగర్‌లో యువకుడి ఇంటి ఎదుట కూర్చున్న యువతి
కుల్కచర్ల : ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని ఓ యువతి ఐదేళ్లుగా న్యాయం పోరాటం చేస్తోంది. కోర్టులు, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగి అలసిపోయానని.. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. తనకు నా అనే వారు ఎవరూ లేరని.. ఉన్న గ్రామంలోనూ తన ప్రేమకు మద్ధతు లభించడం లేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగకుంటే తనకు చావు తప్ప మరో దారి లేదని చెబుతోంది.
న్యాయం కోసం ప్రేమించిన యువకుడి ఇంటి ముందు యువతి బైఠాయించిన సంఘటన మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన అనసూయ అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు గత 5 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు.
ఆ తరువాత ఆంజనేయులుకు ఆర్మీలో ఉద్యోగం రావడంతో ట్రైనింగ్ కోసం వెళ్లి తిరిగొచ్చాడు. గ్రామానికి వచ్చిన ఆంజనేయులను పెళ్లి చేసుకుందామని అనసూయ అడగడంతో నీతో నాకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో గ్రామంలొ కుల పంచాయతీ పెట్టారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో యువతి 2016 ఏప్రిల్ 7న కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో ఆంజనేయులుతో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
అందరూ బెయిలుపై బయటకొచ్చారు. అనంతరం ఆంజనేయులు ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో 2017 మే 13న తనకు న్యాయం చేయాలని కోరుతూ అనసూయ యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. అతనితో పెళ్లి జరిపించాలని అక్కడే కూర్చుంది. కుల్కచర్ల పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి సర్తిచెప్పి పంపించారు. 15 రోజుల క్రితం ఆంజనేయులు ఉద్యోగం నుంచి రావడంతో అనసూయ గురువారం నుంచి అతడి ఇంటి ముందు బైఠాయించింది.
ఆంజనేయులు ఇంటి వారు ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ యువతికి మద్దతుగా పరిగి మహిళా సంఘం మహిళలు మద్దతు పలికారు. కుల్కచర్ల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. యువతికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మహిళలు తెలిపారు. ప్రేమించిన వ్యక్తికోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉందని.. న్యాయం చేయాలని కోరుతున్నారు.
అయితే పెళ్లి... లేదంటే చావు
నాకు ఉన్నవి రెండే దారులు. మొదటిది ఆంజనేయులుతో పెళ్లి.. లేదంటే ఆత్మహత్య చేసుకుని ఇక్కడే అతని ఇంటి ముందే చనిపోతా. ఇప్పటికే పోలీస్‌స్టేషన్‌లకు, కోర్డుల దగ్గరకు ప్రజాప్రతినిధుల దగ్గరకు, మహిళా సంఘాల వద్దకు, కుల పెద్దల దగ్గరకు తిరిగి అలసిపోయాను. గత మూడేళ్లుగా తిరుగుతూనే ఉన్నాను. నాకు అమ్మనాన్నలు ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నే. మా గ్రామంలో కూడా నాకెవరూ మద్ధతు తెలుపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఆంజనేయులతో వివాహం జరగకుంటే చావు తప్ప మరో మార్గం లేదు. – అనసూయ, అనంతసాగర్ బాధిత మహిళ
Comments
Please login to add a commentAdd a comment