ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణారెడ్డి
నెల్లూరు(పొగతోట): జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం ఎన్. కృష్ణారెడ్డి సోమవారం తన చాంబర్‌లో ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన డీఎం తన కార్యాలయానికి చేరుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటన జిల్లాలో అధికారుల వర్గాల్లో సంచలనమైంది.
వివరాల్లోకి వెళ్లితే.. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు మంత్రి సోమిరెడ్డి స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి డీఎం హాజరయ్యారు. సమావేశం నుంచి వచ్చిన తర్వాత తన చాంబర్‌లోకి వెళ్లాడు. జిల్లా అధికారి ఒకరికి ఫోన్ చేసి తన బాధను వ్యక్తం చేసి, ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. తన భార్యకు కూడా ఫోన్ చేసి అదే విషయం చెప్పి, నీవు, పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేశాడని తెలిసింది.
ఇంతలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. డీఎం భార్య వెంటనే కార్యాలయానికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో సిబ్బంది తలుపులు పగులగొట్టి ఆయన్ను రక్షించి బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆ శాఖ అధికారులను సంప్రదించాలని ఫోన్ చేస్తే ఒక్కరు కూడా స్పందించలేదు. విషయం తెలుకున్న మంత్రి సోమిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అక్కడే ఉన్న డీఎం భార్యతో మంత్రి మాట్లాడారు. డీఎం పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండి కోలుకుంటున్నట్లు సమాచారం.
అవినీతి, అక్రమాలు మోపడంతోనే..
డీఎం కృష్ణారెడ్డి కొంత కాలంగా మనోవేదనకు గురవుతున్నాడని సమాచారం. ఆయనకు సంబంధం లేని అవినీతి, అక్రమాలను ఆయనకు ఆపాదించడంతో మనస్థాపానికి గురై కొంత మంది అధికారుల ఎదుట బాధపడినట్లు తెలిసింది.
రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న తనకు ఈ పరిస్థితి ఏమిటోనని ఆవేదన చెందినట్లు చెబుతున్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళతానని అడగ్గా అందుకు అధికారులు అంగీకరించలేదని సమాచారం. ఈ తిట్లు నేను భరించలేను కనీసం తనను సస్పెండ్ చేయమని అడిగినట్లు కూడా తెలిసింది.
ధాన్యం కొనుగోలు, గతంలో సీఎంఆర్ బకాయిలు ఇతర విషయాలపై జిల్లా అధికారి అందరి ఎదుట తిడుతున్నట్లు సమాచారం. కింద సిబ్బంది ఎదుట తిడితే కార్యాలయంలో తనకు వారు ఏ విధంగా గౌరవం ఇస్తారని తోటి అధికారి ఎదుట వాపోయారని తెలిసింది.
గత వారంలో నిర్వహించిన సమావేశంలో నీవు అసమర్థుడివి.. నీ ముఖం నాకు చూపించకు అంటూ పరుషంగా మాట్లాడారని, అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉన్నట్లు కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment