
చిట్టెమ్మ మృతదేహం, వివాహ సమయంలో దంపతుల ఫొటో
కాశిబుగ్గ : కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. వివాహం జరిగి సంవత్సరం తిరగకముందే అదనపు వరకట్నం తేలేదని భార్యను కడతేర్చిన సంఘటన వరంగల్ నగరంలో జరిగింది. ఇంతేజార్‌గంజ్ సీఐ రవికుమార్ తెలిపిన పూర్తి వివరాల ప్రకారం .. నగరంలోని కాశిబుగ్గ మునిసిపల్ కాంప్లెక్స్(ఆంధ్రాబ్యాంకు) ఎదురుగా ఓ అపార్టుమెంట్‌లో అద్దెకు ఉంటున్న పొలెపాక విజయ్‌కుమార్ కాజీపేటకు చెందిన కలువల కృపయ్య కూతురు చిట్టెమ్మ అలియాస్ మేఘన(24)ను 10 నెలల కిందట వివాహం చేసుకున్నాడు.
రెండు నెలల వారి దాంపత్య జీవితం సజావుగా సాగింది. మూడో నెల నుంచి అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశాడు. కాగా మంగళవారం సాయంత్రం విజయ్ తన తల్లి హేమలతతో కలిసి దిండుతో భార్య గొంతు నులిమి హతమార్చినట్లు పోస్టుమార్టం పరీక్షలో నిర్ధారణ అయిందని సీఐ వివరించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment