నేలకింద బందీలు | Yadagirigutta Girls Trafficking | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 3 2018 2:03 AM | Last Updated on Fri, Aug 3 2018 8:20 AM

Yadagirigutta Girls Trafficking - Sakshi

పోలీసులు దాడులకు వస్తే బాలికలను దాచేందుకు గదిలో ఏర్పాటు చేసిన రహస్య ప్రదేశం

  సాక్షి, యాదాద్రి: ఇరుకు గదులు.. మంచం పట్టేంత జాగా.. ఆ మంచం కింద నేలమాళిగలు.. వాటిలో ఒక్కరిద్దరు మనుషులు పట్టేంత స్థలం..! ఇంటి ఆవరణ, ఖాళీ ప్రదేశాల్లో మ్యాన్‌హోల్స్‌.. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై మంచాలు, టేబుళ్లు.. అవి తెరిచి చూస్తే ఓ మనిషి పట్టేంత జాగా..!ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? 

వ్యభిచార గృహాలపై పోలీసులు రైడింగ్‌ చేస్తే బాలికలు, యువతులను దాచిపెట్టేందుకు! చిన్నారుల శరీరాలతో సాగిస్తున్న తమ వికృత క్రీడను కప్పిపెట్టేందుకు. ఊపిరి కూడా ఆడని ఆ నేలమాళిగలు, మ్యాన్‌హోల్స్‌లో చిన్నారుల ఆర్తనాదాలను అదిమిపెట్టేందుకు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వ్యభిచార గృహాల్లో వెలుగు చూస్తున్న భయంకర వాస్తవాలివీ. అచ్చు ముంబైలోని రెడ్‌లైట్‌ ఏరియా తరహాలో సాగుతున్న ఈ రాకెట్‌ వెనుక విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పిల్లల శరీర అవయవాలు పెరిగేందుకు ఇంజెక్షన్ల ద్వారా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌లు ఇవ్వడం, వ్యభిచారం చేయాల్సిందిగా రాచిరంపాన పెట్టడం, దాడుల సమయంలో దాచేందుకు పక్కాగా నేలమాళిగలు, మ్యాన్‌హోళ్ల నిర్మాణాలు.. ఇవన్నీ చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. ఈ చీకటి కూపాల నుంచి ఇప్పటికే 11 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు.. గురువారం ఇంకో నలుగురిని రక్షించారు. మరో ఆరుగురు వ్యభిచార గృహాల నిర్వాహకుల అరెస్టు చేశారు. బాలికలకు ఈస్ట్రోజన్‌ ఇంజెక్షన్‌లు ఇస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇలాగే మరికొందరు పిల్లలు వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నట్టు తెలుస్తోంది. 

రావడం ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం 
యాదగిరిగుట్ట నుంచి పాతగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో పట్టణం నడిబొడ్డున ఉన్న వ్యభిచార గృహాల్లో ఈ నేలమాళిగలు వెలుగు చూశాయి. ఎవరైనా అధికారులు, పోలీసులు వస్తున్నారన్న అనుమానం వస్తే చాలు నిర్వాహకులు.. చిన్నారులు, యువతులను అందులోకి పంపించేస్తారు. వారు వెళ్లిపోయాక అందులోంచి బయటికి తెస్తారు. ఎవరూ గుర్తించలేని విధంగా వీటి నిర్మాణం ఉంటుంది. భూగృహాల్లో ఇద్దరు చిన్నారుల వరకు కూర్చునే వీలుంటుంది. బయటకు రావడం ఆలస్యమైతే ఊపిరి ఆడక అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఇలాంటి గదులు ముంబై రెడ్‌లైట్‌ ఏరియాలో ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఇంటి వరండా, ఖాళీ స్థలాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లే వెలుగుచూశాయి. మనిషి పట్టేంత గుంతలు తీసి పైన మ్యాన్‌హోల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై మంచాలు, టేబుళ్లు పెడతారు. అలాగే బీరువాలు, కప్‌బోర్డులు, డోర్ల వెనుక పిల్లలను నక్కి ఉండేలా ఏర్పాట్లు చేశారు.
 
ఇబ్బడిముబ్బడిగా ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు 
పిల్లలకు ఈస్ట్రోజన్‌ ఇంజెక్షన్‌ ఇస్తున్నాడన్న అనుమానంతో యాదగిరిగుట్టలోని అనురాధ నర్సింగ్‌హోంపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి ఆర్‌ఎంపీ వైద్యుడు నర్సింహను అరెస్ట్‌ చేశారు. అతడిని విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికల అవయవాల ఎదుగుదల కోసం ఈస్ట్రోజన్‌ ఇంజెక్షన్‌ ఇస్తున్నట్టు తేలింది. దీంతోపాటు 48 ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్‌లు ఇతడి వద్ద దొరికాయి. పాడి పశువుల నుంచి అధిక పాలను తీయడానికి ఈ ఇంజెక్షన్‌ను వాడుతారు. ప్రభుత్వం ఈ ఆక్సిటోసిన్‌ను నిషేధించింది. 

మరిన్ని దాడులకు పోలీసులు సిద్ధం 
యాదగిరిగుట్టతోపాటు రాజధాని శివారులోని మరికొన్ని చోట్ల దాడులు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసుల దాడుల నేపథ్యంలో వ్యభిచార గృహ నిర్వాహకులు చిన్నారులను శివారు కేంద్రాల్లో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. ఇంజెక్షన్లు ఇవ్వడంలో మరో ఇద్దరు ఆర్‌ఎంపీ డాక్టర్ల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు పిల్లల్ని కొనుగోలు చేసందుకు కొందరు ఫైనాన్స్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారి కోసం ఆరా తీస్తున్నారు. 
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement