ఏపీ10 ఏఎల్‌ 9947 | Yamaha bike crucial to pregnant murder case | Sakshi
Sakshi News home page

ఏపీ10 ఏఎల్‌ 9947

Published Mon, Feb 12 2018 1:15 AM | Last Updated on Mon, Feb 12 2018 1:15 AM

Yamaha bike crucial to pregnant murder case - Sakshi

బైక్‌పై వెళ్తున్న నిందితుడు (సీసీ ఫుటేజీ దృశ్యం)

హైదరాబాద్‌: బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో గర్భిణి దారుణ హత్య కేసులో సైబరాబాద్‌ పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీసీ ఫుటేజీలకు చిక్కిన బైక్‌లపై దృష్టి సారించిన పోలీసులు.. ఏపీ10ఏఎల్‌9947 నంబర్‌ యమహా ఆల్బా బైక్‌పై నిందితుడు ఓ మహిళ సహకారంతో శ్రీరాంనగర్‌లో గర్భిణి మృతదేహాన్ని పడేసినట్లు గుర్తించారు. ఫోన్‌ నంబర్ల ఆధారంగా బైక్‌పై ఉన్న వ్యక్తే నిందితుడని పోలీసులు నిర్థారణకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నిందితుని చిరునామా, ఇతర వివరాలు పక్కాగా సేకరించిన ప్రత్యేక బృందాలు అతడిని అరెస్ట్‌ చేసేందుకు బయలుదేరినట్టు సమాచారం. అయితే నిందితుడు ఏ రాష్ట్రానికి చెందిన వాడనే దానిని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. 

ఏడు గంటల పాటు తనిఖీలు.. 
నిందితులు ఉన్నట్టుగా భావిస్తున్న సిద్ధిఖీనగర్, అంజయ్యనగర్‌లో ఆదివారం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పోలీసులు విస్తృతంగా గాలించారు. అయినా నిందితులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. సైబరాబాద్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం ఆధ్వర్యంలో మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ పర్యవేక్షణలో దాదాపు 500 మంది పోలీసులు బృందాలుగా తనిఖీలు నిర్వహించారు. నిందితుడు, మహిళ బైక్‌పై మూటలతో వెళుతున్న వీడియోలు, నిందితుడు తన స్నేహితునితో బైక్‌పై వెళుతున్న ఫొటోలను బస్తీవాసులకు చూపించినా గుర్తుపట్టలేకపోయారు. మరోవైపు నంబర్‌ ఆధారంగా బైక్‌ సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌ ఆనంద్‌ కుటీర్‌లో ఉండే విజయ్‌కుమార్‌ గాడ్రేదిగా గుర్తించారు. అక్కడికెళ్లి వాకబు చేయగా బైక్‌ను 2009లో శశికుమార్‌గౌడ్‌కి విక్రయించినట్టు తేలింది. ఈ బైక్‌ దొరికితే నిందితుని ఆచూకీ తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. 

కీలక ఆధారాలు ఇవే.. 
జనవరి 30న బొటానికల్‌ గార్డెన్‌ నైట్‌ సఫారీ ప్రధాన ద్వారం వద్ద గర్భిణీ శరీర భాగాలతో 2 మూటలు లభించిన విషయం తెలిసిందే. సిద్ధిఖీనగర్‌ నుంచి జనవరి 29 తెల్లవారుజామున 3.27 గంటలకు బైక్‌పై మూటలు పెట్టుకుని ఇద్దరు బయలుదేరారు. 3.35కు బొటానికల్‌ గార్డెన్‌ సిగ్నల్‌ వద్దకు వచ్చారు. కుడివైపునకు మళ్లీ 3.37 గంటలకు శ్రీరాంనగర్‌ చేరుకున్నారు. ఓ షాపు ముందు మూటలు పడేసి కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రి వైపు వెళ్లి కొద్దిసేపు ఆగారు. అక్కడి నుంచి వెనక్కి వచ్చి బర్ఫీ స్వీట్‌ హౌస్‌ వద్ద గల్లీలోకి వెళ్లి కొద్దిసేపు ఆగారు. మళ్లీ వెనక్కి వచ్చి మసీద్‌బండ మీదుగా హెచ్‌సీయూ ప్రధాన రహదారికి చేరుకున్నారు. గచ్చిబౌలి స్టేడియం మీదుగా డీఎల్‌ఎఫ్‌ నుంచి జయభేరి లేఅవుట్‌కు వెళ్లారు. ఆర్చ్‌ వద్దకు వెళ్లిన తర్వాత ఎటువైపు వెళ్లిందీ తెలియలేదు. 

28వ తేదీ రాత్రే హత్య.. 
జనవరి 28న రాత్రి గర్భిణీని హత్య చేసి ఉంటారని, తెల్లవారుజామున శ్రీరాంనగర్‌లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం స్టోన్‌ కటింగ్‌ యంత్రంతో కాళ్లు, చేతులు, తల కోసి ఉంటారని భావిస్తున్నారు. నిందితునికి సహకరించిన మహిళ ఎవరు? ఎందుకు సహకరించారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీ ఫుటేజీలో మహిళ స్పష్టంగా కనిపించడం లేదు. సీసీ ఫుటేజీలో మహిళ ఉండటంతో వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులు బైక్‌పై వెళ్లిన ప్రాంతాల్లో ఆయా సెల్‌ ఆపరేటర్ల నుంచి ఫోన్‌ నంబర్లు సేకరించారు. ఆ సమయంలో ఎవరు ఎవరితో మాట్లాడారనే కోణంలో సెల్‌ నంబర్ల డాటా సేకరించారు. రెండు బస్తాలతో బైక్‌పై వెళ్లడం, ఘటనా స్థలానికి చెరడానికి ఎంత సమయం పట్టిందన్న కోణంలో బైక్‌పై పోలీసులు రిహార్సల్‌ చేసినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement