తుపాకులతో పట్టుబడ్డ యరపతినేని అనుచరులు నలబోతు శ్రీనివాసరావు చౌదరి, వడ్లమూడి శివకృష్ణచౌదరి, పూర్ణచంద్రరావు (ఫైల్).. వారి నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు, బుల్లెట్లు, సెల్‌ఫోన్‌లు (ఫైల్)
సాక్షి, గుంటూరు: ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి.. రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన అనుచరుల మధ్య వివాదాన్ని.. వైఎస్సార్‌సీపీ మెడకు చుట్టాలనుకున్నారు. తన హత్యకు కుట్ర పన్నారంటూ వైఎస్సార్‌సీపీ మీద బురద జల్లుతూ ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించారు. అయితే జిల్లా రూరల్ ఎస్పీ ఇది యరపతినేని అనుచరుల మధ్య ఆధిపత్య పోరు మాత్రమే అని పక్కాగా తేల్చడంతో.. ఇప్పుడు ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
వివరాలు.. పల్నాడు ప్రాంతంలో తుపాకులు పట్టుకుని తిరుగుతున్న గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులైన నల్లబోతు శ్రీనివాసచౌదరి, వడ్లమూడి శివరామకృష్ణ చౌదరి, పూర్ణచంద్రరావును ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఓటమి భయంతో ఉన్న యరపతినేని.. తమ అనుచరులు తుపాకులతో పట్టుబడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇది తనకు మరింత చెడ్డ పేరు తెచ్చిపెట్టిందని భావించారు. తనకు రాజకీయ సమాధి తప్పదనుకున్న ఆయన వెంటనే.. తన హత్యకు వైఎస్సార్‌సీపీ కుట్ర పన్నిందంటూ ఎల్లో మీడియాలో కథనాలు రాయించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించారు. అయితే యరపతినేని ప్రధాన అనుచరుడు, మైనింగ్ మాఫియాలో కీలక సూత్రధారి అయిన ముప్పన వెంకటేశ్వర్లును మట్టుబెట్టేందుకు.. మిగతా అనుచరులంతా ఏకమై తుపాకులు తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. యరపతినేని నామినేషన్ కార్యక్రమంలోనే వెంకటేశ్వర్లును కాల్చి చంపాలనుకున్నట్లు వెల్లడైంది.
ఇదంతా యరపతినేని అనుచరుల ఆధిపత్య పోరులో భాగమేనని గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు. అయినా కూడా ఓటమి భయంతో ఉన్న యరపతినేని.. ఎల్లో మీడియా ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు యరపతినేని అనుచరులు అనుకున్నది పక్కాగా జరిగితే.. ఆ నేరాన్ని వైఎస్సార్‌సీపీ నేతలపైకి నెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారేమోననే అనుమానాలను స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, తుపాకులతో పట్టుబడ్డ నలబోతు శ్రీనివాసరావు చౌదరితో పాటు ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచురుడు ముప్పన వెంకటేశ్వర్లు.. గతంలో జరిగిన కాంగ్రెస్ నేత ఉన్నం నరేంద్ర హత్య కేసులో నిందితులు. అయినా కూడా దొంగే దొంగా అని అరిచినట్లుగా ఉంది ఆయన తీరు అని స్థానికులు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఇలాంటి కుట్రలు పన్నుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
పల్నాడులో యథేచ్ఛగా అక్రమ క్వారీయింగ్
ఎన్నికల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు భారీగా మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ.. పిడుగురాళ్ళ, దాచేపల్లి, కేశానుపల్లి, తంగెడ తదితర ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ తవ్వకాలకు పాల్పడుతోంది. భారీ ఎత్తున బ్లాస్టింగ్‌లకు పాల్పడుతూ అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచుతోంది. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళితే.. ఘోర సంఘటనలు జరిగే ప్రమాదముంది. పోలీస్‌స్టేషన్లకు కూతవేటు దూరంలో బ్లాస్టింగ్‌లు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment