సాక్షి ప్రతినిధి, చెన్నై: కట్టుకున్న భర్త మరికొందరు మహిళలపై ఆకర్షణ పెంచుకోవడాన్ని ఏదేశానికి చెందిన భార్య అయినా సహించలేదనే సత్యాన్ని చాటే సంఘటన ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో చోటుచేసుకుంది. భర్త సెల్‌ఫోన్‌లోని అశ్లీల చిత్రాలు, పలువురు మహిళ ఫొటోలను చూసిన భార్యకు ఆగ్రహం కట్టలు తెంచుకోగా ఆకాశంలో ఎగురుతున్న విమానంలోనే పరస్పర దాడులకు దిగారు. సోమవారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖతార్ ఎయిర్‌వేస్ విమానం దోహా నుంచి బయల్దేరి సోమవారం ఉదయం ఇండోనేషియాలోని పాల్దీవులకు వెళుతోంది. ఈ విమానంలో 284 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఇరాన్ దేశానికి చెందిన ఓ యువజంట చంటిబిడ్డను వెంటబెట్టుకుని వెళుతోంది. భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో కాలక్షేపం కోసం భార్య అతని సెల్‌ఫోన్ తీసుకుని ఆమె ఆన్ చేసింది. భర్త వేలిముద్రలే పాస్‌వర్డ్ కావడంతో అతని వేలిని ఉపయోగించి సెల్‌ఫోన్ ఓపెన్ చేయగలింది. సెల్‌ఫోన్‌లో లెక్కలేనన్ని అశ్లీల చిత్రాలు, కొందరు మహిళల ఫొటోలు ఉండడంతో భార్య ఖిన్నురాలైంది. కోపంతో ఊగిపోతూ భర్తను నిద్రలేపి ఏమిటీ ఫొటోలు అంటూ నిలదీసింది. నా అనుమతి లేకుండా సెల్‌ఫోన్ ఎందుకు తీసుకున్నావని కోపగించుకున్న భర్త, భార్యను కొట్టాడు. ఇందుకు మరింత ఆగ్రహం చెందిన భార్య భర్తపై చేయిచేసుకుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరిపోయింది.
ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకుంటూ విమానంలో కిందపడి దొర్లాడారు. ఈ ఘర్షణ జరుగుతున్నపుడు విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. భార్యాభర్తల మధ్య సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించిన ఎయిర్‌హోస్టెస్, ప్రయాణికులపై దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. ఘర్షణ ఆపకుంటే విమానం నుంచి మధ్యలోనే దించేయాల్సి వస్తుందని పైలట్ హెచ్చరించినా మానుకోలేదు. ప్రస్తుతం తాము ఎక్కడ ప్రయాణిస్తున్నామని కెప్టెన్ విచారించి సమీపంలో చెన్నై ఎయిర్‌పోర్టు ఉన్నట్లు తెలుసుకున్నారు. కంట్రోల్ రూముకు సమాచారం ఇచ్చి సోమవారం ఉదయం 10.15 గంటలకు చెన్నైలో విమానాన్ని ల్యాండ్ చేశారు. భార్యాభర్తలిద్దరిని బలవంతంగా దించివేసి 282 ప్రయాణికులతో విమానం ఎగిరిపోయింది. భారత్‌తో పర్యటించేందుకు ఆ దంపతులకు అనుమతి లేకపోవడంతో అధికారులను బతిమాలుకుని 11.05 గంటలకు మలేషియాకు వెళ్లి అక్కడి నుంచి మరో విమానంలో పాల్దీవులకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment