భార్గవి మృతదేహం
నేను పోతున్నా డాడీ.. అని కూతురు అంటుంటే ఆ తండ్రి కళ్ల వెంట జలధారలు పొర్లాయి. నీకేం కాదు బిడ్డా నా దగ్గర డబ్బులున్నాయి. నిన్ను బతికించుకుంటా. అని తండ్రి ధైర్యం చెప్పాడు. అప్పుడు తాను పురుగుల మందు తాగినట్లు అసలు విషయం చెప్పింది. అయినా కూతురును బతికించుకోవాలనుకున్నాడు ఆ తండ్రి.. కానీ అంతలోపే పరలోకానికి వెళ్లిపోయింది. కన్నవారికి పుట్టెడు దుఖాఃన్ని మిగిల్చింది.
కడెం(ఖానాపూర్): కడెం మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన అమరవేణి శ్రీనివాస్‌గౌడ్–అనసూయ దంపతుల కూతురు అమరవేణి భార్గవి(19) పురుగుల మందు తాగి సోమవారం మృతి చెందింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్గవి ఆదివారం గ్రామ సమీపంలోని పొలం వద్ద పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు నిజామబాద్ తరలించే క్రమంలో మార్గ మధ్యలో ఆర్మూర్ వద్ద ఆమె మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై జన్నారపు నారాయణ తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతూ..
ఖానాపూర్‌లో ఇటీవలే డీగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన భార్గవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి విషయం ఎవరికి చెప్పకుండా ఇంటికి చేరుకుంది. రాత్రి భార్గవి తండ్రి తిన్నవా బిడ్డ అని పలకరించడంతో లేదు నాన్న అని భార్గవి సమాధానమిచ్చింది. బిడ్డ తినలేదనే బెంగతో పండ్లు తినమని ఇచ్చాడు. పండ్లు తింటుండగానే భార్గవి వాంతులు చేసుకుంది. దీంతో ఆమెను ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తల్లి దండ్రులకు, వైద్యులకు పురుగుల మందు తాగిన విషయం తెలియకపోవడంతో సాధారణ చికిత్సను అందించారు. పరిస్థితి విషమించడంతో చివరి క్షణాల్లో తండ్రిని దగ్గరకు పిలిచి నేను పోతున్న డాడీ అని భార్గవి చెప్పింది. భయపడకమ్మా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నిన్ను బతికించుకుంట అని ధైర్యనిచ్చాడు తండ్రి. భార్గవి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పింది. తండ్రి హూటాహూటిన నిజామాబాద్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో భార్గవి చనిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment