
అపర్ణ (ఫైల్)
నిజాంపేట్: ‘తమ్ముడు, చెల్లెలు చదువుల కోసం నగరంలోని ఓ ఇంట్లో పనికి కుదిరిన యువతి మృతి చెందడం కలకలం సృష్టించింది. ఇంటి యజమాని వేధింపుల తాళలేకనే తన కూతురు చనిపోయిందని మృతురాలి తల్లి.. అలాంటిదేమీ లేదు.. ఇతర కారణాలతోనే మరణించిందని యజమాని పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ప్రగతినగర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ప్రసాద్ అనే ఫర్నిచర్ వ్యాపారి ఇంట్లో తూర్పుగోదావరి జిల్లా పోతులూరుకు చెందిన అపర్ణ (16) నాలుగేళ్లుగా పని చేస్తోంది. అపర్ణ పంపించే డబ్బుతోనే ఆమె తల్లి అర్జమ్మ కొడుకు, కూతురునూ చదివిస్తోంది.
మూడు రోజల క్రితం వాచ్‌మన్ ఫోన్ ద్వారా అపర్ణ తన తల్లితో మాట్లాడింది. తానిక్కడ ఉండలేకపోతున్నానని వచ్చి తీసుకువెళ్లాలని కోరింది. లాక్‌డౌన్ కావటంతో తల్లి రావటం కుదర్లేదు. ఇదే క్రమంలో ఈ నెల 1న ఉదయం తొమ్మిది గంటల సమయంలో ప్రసాద్ ఇంట్లోనే అపస్మారక స్థితిలో పడి ఉన్న అపర్ణను తొలుత స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి కూకట్‌పల్లికి, అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించి అపర్ణ మరణించింది. మంగళవారం నగరానికి చేరుకున్న ఆమె తల్లి.. కూతురు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం అపర్ణ మృతదేహాన్ని పోతులూరుకు తరలించారు.
ఆ రెండో వ్యక్తి ఎవరు?
అపర్ణ 2016 నుంచి ప్రసాద్ ఇంట్లో పని చేస్తున్నట్లు తల్లి ఫిర్యాదు చేశారు. అపర్ణ తన చివరి కాల్‌ను తల్లితో పాటు మరో వ్యక్తికి కూడా చేశారు. రెండో వ్యక్తి ఎవరూ అనేది విచారణలో తేలాల్సి ఉంది. ప్రసాద్ ఇంట్లో లభించిన మూత తీసిన పురుగుల మందు డబ్బా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన సమయంలో నోట్లోంచి నురగ వచ్చిందని, పురుగుల మందే తాగి ఉంటుందని భావిస్తున్నారు. యజమాని వేధింపుల వల్లే కూతురు మృతి చెందినట్లు తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ప్రసాద్‌ఫై కేసు నమోదు చేస్తినట్లు బాచుపల్లి సీఐ జగదీశ్వర్ తెలిపారు.
పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా ముందుకు వెళతామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment