విలేకరులకు వివరాలు చెపుతున్న డీఎస్పీ ఈశ్వరరావు, వెనుక నిందితుడు ముఖేష్
ఏలూరు టౌన్: వ్యసనాలకు బానిసయ్యాడు.. సులువుగా డబ్బు సంపాదించేందుకు అలవాటుపడ్డాడు.. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌లో తన ఫొటోలు, ప్రొఫైల్ పిక్స్ పెడతాడు.. మహిళలకు రిక్వెస్టులు పంపుతూ గాలం వేస్తుంటాడు.. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారో ఇక అంతే సంగతులు.. తనదైన శైలిలో ప్రేమపాఠాలు వల్లించి.. చివరికి బెదిరింపులకు, వేధింపులకు దిగుతాడు.. కుదిరితే డబ్బు లేదా బంగారు ఆభరణాలు సమర్పించుకోవాల్సిందే. ఈ బంగారాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లోనూ, తాకట్టు వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని ఇక జల్సాలు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తాడు. ఇటువంటి మోసగాడు చివరికి పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇటువంటి ఘటన ఏలూరు నగరంలో రెండోదిగా పోలీస్ రికార్డులకు ఎక్కింది. ఈ యువకుడిని ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. వివరాలను ఆదివారం ఏలూరులో డీఎస్పీ వెల్లడించారు.
ఏలూరు తూర్పువీధికి చెందిన చిన్నపల్లి ముఖేష్‌సాయి స్థానిక ఒక కళాశాలలో డిగ్రీ వరకూ చదివాడు. తల్లిదండ్రులను వదిలి భీమవరంలో నివసిస్తున్నాడు. సినిమాల ప్రభావంతో విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ముఖేష్ నిర్ణయించుకున్నాడు. మహిళలు, యువతులకు వలవేస్తూ లోబరుచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాదులోని ఏవియేషన్ సెంటర్లో శిక్షణ పొందుతున్న ఏలూరు ఆర్‌ఆర్ పేటకు చెందిన ఓ యువతిని సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకున్నాడు. వీరిద్దరూ కొద్దికాలం ఫేస్‌బుక్, వాట్సాప్‌లో చాటింగ్‌లు చేసుకున్నారు. కొద్దిరోజులకు తాము షేర్ చేసుకున్న ఫొటోలను ఇంటర్నెట్‌లో పెడతానని అతను బెదిరించి బంగారు ఆభరణాలు కాజేశాడు. ఇదే విధానంలో విశాఖపట్నానికి చెందిన ఓ వివాహిత మహిళతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. తమ మధ్య సంభాషణలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరిస్తూ 528 గ్రాముల బంగారు ఆభరణాలను బలవంతంగా గుంజాడు. ముఖేష్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు అతని వివరాలు సేకరించారు. త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు ముఖేష్‌ను ఆదివారం అరెస్ట్ చేసి అతని వద్దనుంచి సుమారు రూ.15 లక్షల విలువచేసే 450 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో త్రీటౌన్ ఎస్‌ఐ ఎ.పైడిబాబు, ఏఎస్సై రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ దిలీప్, కానిస్టేబుల్ బాజీ ఉన్నారు.
మూడు నెలల్లో రెండో కేసు
ఏలూరు నగరంలో మూడు నెలల్లో ఇది రెండో కేసు. ముఖేష్‌తోపాటు ఈ కేసులోనూ మరో ముగ్గురు యువకులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నా.. పోలీసులు దర్యాప్తు చేసి చివరికి ముఖేష్‌ను అరెస్ట్ చేశారు. మొదటి కేసులో ఏకంగా ఆ ముఠా నుంచి రూ.1.20కోట్ల బంగారు ఆభరణాలు, నగదు, కార్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
పరిచయాల విషయంలో జాగ్రత్తలు పాటించండి
సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాలపై మహిళలు, యువతులు జాగ్రత్తలు పాటించాలని డీఎస్పీ ఈశ్వరరావు సూచించారు. యువతులు సామాజిక మాధ్యమాల్లో ఇతరులతో పరిచయానికి రిక్వెస్టులు పంపేప్పుడు, ఇతరుల రిక్వెస్టులు యాక్సెప్ట్ చేసే విషయంలో ఆచితూచి అడుగేయాలని కోరారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వేధింపులకు గురిచేస్తే కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment