భగ్గుమన్న పాతకక్షలు..! | Young Man Brutal Murder In Nalgonda | Sakshi
Sakshi News home page

యువకుడు దారుణ హత్య

Jun 3 2019 9:22 AM | Updated on Jun 3 2019 9:22 AM

Young Man Brutal Murder In Nalgonda - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు

నివురుగప్పిన నిప్పులా ఉన్న పాతకక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బంధువుల శుభకార్యానికి వెళ్లొస్తున్న ఓ యువకుడిని ప్రత్యర్థులు దారికాచి కత్తులతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. దీంతో ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లా అన్నారం బ్రిడ్జి పంచాయతీ శివారులో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు..

పెన్‌పహాడ్‌(సూర్యాపేట): మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నకిరేకంటి వెంకటేశ్వర్లు (27) సీపీఎం గ్రామ కార్యదర్శిగా కొనసాగుతూ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు ఆదివారం తమ బంధువుల వ్యవసాయ భూమిలో జరుగుతున్న ఉప్పలమ్మ పండుగకు హాజరయ్యాడు. అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రత్యర్థులు అన్నారం బ్రిడ్జి శివారులో దారికాచి వేటేశారు. కత్తిపీటతో వెంకటేశ్వర్లు తల, పొట్టభాగంలో దాడి చేయడంతో అక్కడికక్కడే నెలకొరిగాడు. దుండగులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని  నారాయణగూడెం గ్రామ శివారులో వదిలేసి వెళ్లారు.
 
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
అన్నారం బ్రిడ్జి శివారులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడనే విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, లవకుమార్, మల్లేశంలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హత్యకు పాతకక్షలే కారణమని భావిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.  గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మిన్నంటిన రోదనలు
నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నకిరేకంటి భిక్షానికి వెంకటేశ్వర్లు ఒక్కడే కుమారుడు. ఇతనికి అక్కా, చెల్లి కూడా ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు దారుణహత్యకు గురయ్యాడనే వియాన్ని తెలుసుకున్న తల్లిదండ్రి కుప్పకూలిపోయారు. కుమారుడి మృతదేహంపై పడి గుండలవిసేలా రోదించారు. ప్రత్యర్థులే ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ప్రత్యర్థుల పనేనా..?
మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నకిరేకంటి రమేశ్‌ కుటుంబ తగాదాల నేపథ్యంలో గత ఏడాది మార్చి 30వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఆ కేసులో వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడు. కాగా, వెంకటేశ్వర్లు మూడు మాసాల క్రితమే బెయిల్‌పై విడుదలై గ్రామానికి వచ్చాడు. అయితే వెంకటేశ్వర్లును ప్రత్యర్థులే మాటేసి ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement