సాక్షి, కర్నూలు, గుంటూరు : ప్రేమ పేరుతో తమ కుమార్తెతో ఓ యువకుడు పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తర్వాత కట్నం ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడని కర్నూలు జిల్లాకు చెందిన దంపతు లు బుధవారం అర్బన్ గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు. వివరాలు.. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పసుపల గ్రామానికి చెందిన రైమాపురం మద్దిలేటి, బాలనాగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వీరు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కుమార్తెను గుంటూరులోని బ్రాడీపేటలో ఉన్న బండ్లమూడి హనుమాయమ్మ కళాశాలలో డిగ్రీలో చేర్పించారు.
మూడు సంవత్సరాలుగా అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. మద్దిలేటి పెద్దకుమారుడు మధు కూడా గుంటూరులోని టీజేపీయస్ కళాశాలలో డిగ్రీ చదువుతుండేవాడు. అదే కశాశాలలో వినుకొండ ప్రాంతానికి చెందిన మద్దుల బాలయోగశ్వరరావు అలియాస్ మద్దుల బాలు చదువుతుండేవాడు. అతడి ఫోన్ నుంచి మధు తరచూ చెల్లెలితో మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో బాలు కూడా అదే నంబర్‌కు ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ ప్రేమించుకోవడం ప్రారంభించారు. నిత్యం ఫోన్‌లో మాట్లాడుతున్న విషయం తెలుసుకుని మద్దిలేటి, బాలనాగమ్మ దంపతులు కుమార్తెను స్వగ్రామానికి తీసుకెళ్లిపోయారు. బాలు అక్కడకు వెళ్లి ఆమెను వివాహం చేసుకుంటానని, తన పెద్దలను ఒప్పిస్తానని నమ్మించాడు. దీంతో మరలా గుంటూరుకు పంపారు. 15 రోజుల కిందట ఇద్దరూ బాలుకు వివాహం విషయం గుర్తు చేశారు. రూ.20లక్షలు కట్నంతో పాటు రెండు ఎకరాల పొలం కూడా కావాలని, లేనిపక్షంలో చేసుకునే ప్రసక్తే లేదని చెప్పి వెళ్లిపోయాడు. దీనిపై పది రోజుల క్రితం అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. బాలు స్థానిక బీజే పీ నాయకులతో ఒత్తిడి తేవడంతో పోలీసులు పట్టించుకోలేదు. మద్దిలేటి, బాలనాగమ్మలకు దిక్కుతోచక అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment