మృతుడు అయ్యనార్
అన్నానగర్ (తమిళనాడు): మహిళ గొంతుతో మాట్లాడి మోసం చేశాడనే కారణంతో తమిళనాడులో ఓ యువకుడిని పోలీసు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో బుధవారం జరిగింది. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్ సమీపంలోని వ.పుదుపట్టి, క్రిస్టియన్‌పేటకు చెందిన తెర్కుమలై కుమారుడు అయ్యనార్(25) ఓ ప్రైవేటు కళాశాలలో బీఎడ్ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన కలైయరసన్ కుమారుడు కుమార్(26) చెన్నై ఎన్నూర్‌లో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుమార్ మొబైల్ నంబర్ తెలుసుకున్న అయ్యనార్ అతడితో మహిళ గొంతుతో మాట్లాడాడు. అయ్యనార్‌ని మహిళే అనుకుని కుమార్ కూడా మాట్లాడసాగాడు.
ఈ క్రమంలో సొంతూరికి వచ్చిన కుమార్ తనతో మహిళగా మాట్లాడింది అయ్యనార్ అని తెలుసుకుని, ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు యత్నించాడు. బంధువులు గుర్తించి, ఆరాతీయగా జరిగిందంతా చెప్పాడు. దీంతో వారు అయ్యనార్‌ను హత్య చేయాలని నిర్ణయించారు. కుమార్ సోదరుడు విజయకుమార్(21), స్నేహితులు తమిళరసన్(27), జె.తమిళరసన్ (23)లు కుమార్ రమ్మన్నాడని చెప్పి అయ్యనార్‌ను బుధవారం రాత్రి పోదర్ కన్‌మామ్ సమీపంలోని ఓ తోటలోకి తీసుకెళ్లారు. అక్కడే కాచుకుని ఉన్న కుమార్, మిగతా ముగ్గురు అయ్యనార్‌ని కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యారు. పోలీసులు కుమార్ మినహా మిగతా ముగ్గురిని అరెస్టు చేశారు. కుమార్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment