బాలా మృతదేహం
నల్లగొండ క్రైం : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లా కేంద్రం శివారు గిరకబాయిగూడెం రోడ్డు రైల్వేట్రాక్ పక్కన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం మద్దిపట్ల గ్రామపంచాయతీ పరిధి చింతల్‌తండాకు చెందిన ఝాన్సీ దివ్యాంగురాలు. ఝాన్సీ స్థానిక కెనరా బ్యాంక్‌లో ఉగ్యోగిగా పనిచేస్తోంది. ఈమెకు సహాయకుడిగా సోదరుడైన రమావత్ బాలా (35) ఐదేళ్లుగా ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి తులసీనగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బాలాకు ఐదేళ్ల క్రితమే వివాహం కాగా విభేదాలు రావడంతో నెలరోజులకే విడిపోయారు. అప్పటినుంచి బాలా మరో వివాహం చేసుకోకుండా సోదరికి సహాయకుడిగా ఉంటున్నాడు.
సాయంత్రం ఇంటినుంచి వెళ్లి..
బాలా మంగళవారం సాయంత్రం ఇంటినుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో సోదరి ఝాన్సీ అర్ధరాత్రి అవుతున్నా సోదరుడు తిరిగిరాకపోవడంతో ఫోన్ చేయగా స్వచ్ ఆప్ వచ్చింది. దీంతో కంగారుపడి స్థానిక తిరుమలనగర్‌లో నివాసముంటున్న సోదరి నీలాకు ఫోన్‌చేసి వాకబు చేసినా అక్కడకు రాలేదని చెప్పింది. ఆమె సమీపంలోనే నివాసముంటున్న బంధువులకు ఫోన్ చేసినా బాలా ఆచూకీ తెలియలేదు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడన్న సమాచారం మేరకు డీఎస్పీ గంగారాం, టూటౌన్ సీఐ బాషా ఇతర సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకున్నారు. ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఆరా తీశారు. అనంతరం జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు. పలువురు అనుమానితుల గుర్తించి వారికోసం ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్ సీఐ బాషా తెలిపారు.
రైల్వేట్రాక్ సమీపంలో విగతజీవుడై..
రైల్వేట్రాక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి విగతజీవుడిగా పడి ఉన్నాడని చర్చించుకుంటుండడంతో స్థానికంగానే ఉంటున్న నీలా బంధువులు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమె ఘటనాస్థలికి వచ్చి బాలాగా గుర్తించింది. అతడి తలపై దుండగులు బలమైన రాడ్‌తో మోదడంతోనే ప్రాణాలు విడిచినట్టు ఆనవాళ్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment