కుటుంబ సభ్యులు, స్నేహితులకు యువకుడిని అప్పగిస్తున్న గద్వాల రైల్వేపోలీసులు
గద్వాల అర్బన్: ప్రేమ విఫలమైందని మనస్థాపానికి చెందిన ఓ యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.. హైదరాబాద్ నుంచి కర్నూల్ రైలు ఎక్కి స్నేహితులకు వాట్సప్ ద్వారా ‘‘ఐ మిస్ యూ’’ అంటూ ఫొటో మెసేజ్ పంపించి ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకున్నాడు.. అనుమానించిన స్నేహితులు కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులకు సమాచారం అందజేసి రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు.
వెంటనే తేరుకున్న రైల్వే పోలీసులు ఆ యువకుడిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన సంఘటన ఆదివారం రాత్రి గద్వాల పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా.. కర్నూల్ పట్టణానికి చెందిన మణిరత్నంకు తల్లిదండ్రులు లేరు. మామ దగ్గర పెరిగాడు. ఉపాధి నిమిత్తం బావ సురేష్ వద్ద ఉంటూ.. హైదరాబాద్‌లో ఓల్వా క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాడు. ఆమె ఇటీవలే వివాహం చేసుకొని వెళ్లిపోయింది. మనస్థాపానికి గురై చనిపోవాలనుకున్నాడు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో కాచిగూడలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. అనంతరం సెల్ఫీ దిగి ‘‘ఐ మిస్ యూ’ అంటూ స్నేహితులకు వాట్సప్ ద్వారా పోస్ట్ చేశాడు.
స్నేహితుల సమాచారం మేరకు..
ఏదో జరుగుతుందని అనుమానించిన స్నేహితులు మణిరత్నం బావ సురేష్‌కు సమాచారం అందజేశారు. వెంటనే వీరందరూ కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే పోలీసులకు విషయం చెప్పారు. దీంతో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల పోలీసులను రంగంలోకి దింపారు. చివరకు రాత్రి 11గంటల సమయంలో గద్వాలకు చేరుకున్న రైలులో గద్వాల పోలీసులు వాట్సప్‌లో వచ్చిన ఫొటో ఆధారంగా యువకుడిని గుర్తించి ఆధీనంలోకి పెట్టుకున్నారు.
స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అర్ధరాత్రి గద్వాలకు చేరుకున్నారు. మానసికంగా కృంగిపోయిన యువకుడికి పోలీసులు సుమారు రెండుగంటల వరకు కౌన్సిలింగ్ ఇచ్చి తెల్లవారుజామున కర్నూల్‌కు పంపించారు. యువకుడిని కాపాడిన గద్వాల రైల్వే పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment