
పోలీసులతో వాగ్వాదానికి దిగిన యువతి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురికి పోలీసులు జరిమానా విధించారు. టీఎస్ 09 ఈటీ 2000 పేరుతో ఉన్న కారు నడుపుతూ గీతాంజలి అనే యువతి పట్టుబడింది. ఆమెను శ్వాసపరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించగా ససేమిరా అంది. దీంతో చాలాసేపు పోలీసులకు, సదరు యువతికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
రెండు గంటల పాటు ఆమె శ్వాసపరీక్షలకు నిరాకరించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్‌ప్లేట్‌పై ‘జిల్లా రెవెన్యూ అధికారి, అడిషినల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్’ అని రాసి ఉండటంతో పోలీసులు ఆమె గురించి వాకబు చేశారు. తాను ఐఏఎస్ అధికారి కూతురినంటూ బెదిరించింది. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆమెను స్టేషన్‌కు తరలించారు. ఆరా తీయగా ఆమె తండ్రి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి పెంచలయ్యగా తేలింది. శ్వాసపరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. బీఏసీ కౌంట్ 141గా నమోదైంది. కారును సీజ్ చేశారు. కాగా గీతాంజలి నగరంలో ఉంటూ ఐఏఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది.
తండ్రి కారునే ఉపయోగిస్తోందని పోలీసుల విచారణలో తేలింది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 123 మందిపై కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment