ప్రశాంతి మృతదేహం ,రోడ్డుపై విరిగిపడి ఉన్న విద్యుత్ స్తంభం
కొత్తవలస రూరల్: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యాళ్ల ప్రశాంతి (20) అనే యువతి దుర్మరణం చెందింది. స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస – దేవరాపల్లి రహదారిలో దేవాడ– ముసిరాం మధ్య శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఆదివారం ఉదయం కొత్త విద్యుత్ స్తంభం వేశారు.
విరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని తొలగించలేదు. ఇదిలా ఉంటే విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన యాళ్ల ప్రశాంతి (20) బీటెక్ పూర్తి చేసి గాజువాకలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం దేవరాపల్లి సమీపంలోని వాలాబీ జలపాతం వద్దకు విహారయాత్రకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై విశాఖ వస్తుండగా, దేవాడ – ముసిరాం వద్ద బస్సును ఓవర్‌టేక్ చేయబోతూ చీకట్లో రోడ్డుపై పడి ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంతి అక్కడికక్కడే కన్నుమూసింది. విషయం తెలుసుకున్న సీఐ ఆర్.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్ చేరుకుని విద్యుత్ స్తంభాన్ని పక్కకు తీయించి రాకపోకలు క్రమబద్ధీకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. యాళ్ల ప్రశాంతి స్నేహితులు సంతోష్, మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment