
రక్తపు మడుగులో జగదీష్ మృతదేహం
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): సొంత తమ్ముడే కాలయముడయ్యాడు. భార్యా, పిల్లలను రోజూ మద్యం మత్తులో కొడుతున్నాడన్న కారణంతో అన్నను చంపేయడంతో పెదజాలారిపేటలో కలకలం రేగింది. ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదజాలారిపేట గాంధీసెంటర్ సమీపంలో మడ్డు జగదీష్(40) భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. ఇతను సముద్రంలో చేపల వేటకు వెళ్తూ కుటుంబ పోషణ చేస్తున్నాడు. జగదీష్‌కి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నేపథ్యంలో జగదీష్ రోజూ మద్యం మత్తులో భార్యా, పిల్లలను కొడుతుండేవాడు.
దీంతో వన్‌టౌన్‌లో గల జగదీష్ తమ్ముడు మడ్డు స్వామికి వదిన, పిల్లలు తమ గోడు వెల్లబోసుకునేవారు. దీంతో స్వామి ఇప్పటికే పలుసార్లు జగదీష్‌ని ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికాడు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో జగదీష్ ఇంటి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గొడవ జరిగింది. భార్యా, పిల్లలను కొట్టవద్దని అన్నయ్యను స్వామి గట్టిగా హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం పెరిగింది. మాటా మాటా పెరగడంతో స్వామి కత్తితో జగదీష్ పొట్ట భాగంలో పొడిచి హత్యచేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సంఘటనా స్థలాన్ని ఎంవీపీ సీఐ ఎం.మహేశ్వరరావు, ఎస్‌ఐ ధర్మేంద్ర, తదితరులు పరిశీలించారు. సీఐ పర్యవేక్షణలో ఎస్‌ఐ ధర్మేంద్ర కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment