సాక్షి, కడప : కొండంత సంతోషంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కొద్దిసేపటికే పెనువిషాదం చోటుచేసుకుందా గ్రామంలో! కేక్ కటింగ్ అనంతరం రోడ్డు పక్కనే చలిమంటవేసుకున్నవారిపైకి మృత్యుశకటం దూసుకొచ్చింది. చిన్నాపెద్ద అంతాకలిపి ఐదుగురు దుర్మరణం చెందారు. వైఎస్సార్‌జిల్లా పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిందీ సంఘటన. ఈ గ్రామం కడప-పులివెందుల ప్రధాన రహదారిపై ఉంది.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు : స్థానిక ఇందిరానగర్‌లో నివసిస్తోన్న యువకులు, బారులు.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొన్నారు. కడప-పులివెందుల ప్రధాన రహదారి పక్కనే చలిమంటవేసుకుని ముచ్చట్లలో మునిగిపోయారు. అంతలోనే ఓ కారు అదుపుతప్పి.. వారివైపునకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో భాస్కర్ (28), గిరి (14), కార్థిక్ (12), లక్ష్మీ నరసింహ (10)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారును నడిపిన బ్రహ్మానందరెడ్డి (24) కూడా మృత్యువాత పడ్డారు.
మద్యం సేవించి కారు నడపడం వల్లే?: మోతాదుకు మించి మద్యం సేవించి కారు నడపడం వల్లే కొత్త ఏడాది విషాదానికి కారణమని తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
వైఎస్సార్‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment