చంద్రబాబు విజిల్ వేస్తున్నారు: అంబటి
ఏలూరు: రాష్ట్రం చీలిపోదని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. సిగ్గుంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలని, అప్పుడే విభజన ఆగిపోతుందన్నారు. ఏలూరు మండలం తంగెళ్లమూడిలో శుక్రవారం నిర్వహించిన దెందులూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి విభజన పక్రియ ఆగదా అని ప్రశ్నించారు. ఓట్లు- సీట్లు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న విభజన ఆటకు రెండు కళ్ల సిద్ధాంతం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విజిల్ వేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన పక్రియను ఆపేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పార్టీ నేతలను కలుస్తుంటే.. చంద్రబాబు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన జరగనీయబోమంటూ టీవీల్లో షో ఇస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని ప్రగల్భాలు పలికిన కావూరి, చిరంజీవి మంత్రి పదవులు రాగానే కిమ్మనకుండా ఉండిపోయారని విమర్శించారు. విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన లగడపాటి రాజగోపాల్ తన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడం లేదంటూ నాటకాలు ఆడుతున్నాడని దుయ్యబట్టారు. సమావేశంలో వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైసీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు పీవీ రావు, అశోక్‌గౌడ్, కొఠారు రామచంద్రరావు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.