విభజనకు చంద్రబాబే బాధ్యుడు: అంబటి
రాష్ట్ర విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే బాధ్యుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. బాబు ఇచ్చిన పదునైన కత్తిలాంటి లేఖ వల్లే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండుగా నరుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ విభజన అనివార్యమైతే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు.
చంద్రబాబు అధికార దాహంతోనే బస్సుయాత్ర చేపట్టాలని అనుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన ఇన్ని రోజుల తరువాత చంద్రబాబు ఇప్పుడు మేల్కోన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుజాతికి సమాధానం చెప్పిన తర్వాతే యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలుగువాడి జాతి పెంపొందించిన ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచి ఆయన గద్దెను లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు బస్సుయాత్ర పేరిట ప్రజల దగ్గరకు ఎలా వెళ్తారని అంబటి ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడే తెలంగాణకు బీజం పడిందని దిగ్విజయ్ సింగ్, సీఎం కిరణ్ వ్యాఖ్యానించడం బాధకరమని అన్నారు.