న్యూజెర్సీలో ఘనంగా యోగా దినోత్సవం
న్యూజెర్సీ :
హిందూ స్వయం సేవక్ సంఘ్(హెచ్ఎస్ఎస్) ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. భారతీయ జనత పార్టీ ముంబై యువజన మోర్చా ప్రెసిడెంట్ మోహిత్ కాంబోజ్, ఉడు బ్రిడ్జి మేయర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 750 మందిపైగా యోగా దినోత్సవంలో పాల్గొని యోగా ఆసనాలు వేశారు.
భారతీయ వారసత్వ సంపదైన యోగాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేస్తుండటం ఎంతో గర్వకారణం అని మోహిత్ కాంబోజ్ అన్నారు. ప్రపంచశాంతి, సామరస్య సాధనకు యోగాకు మించిన మాధ్యమం మరొకటి లేదని అభివర్ణించారు. బుద్ధినీ, శరీరాన్ని ఏకం చేసే శక్తి ఒక్క యోగాకే ఉందన్నారు. అంతేకాదు, యోగాతో శారీకర ఆరోగ్యంతోపాటు మానసిక వికాసం కూడా సాధ్యమనే విషయం నేడు ప్రపంచం గుర్తించిందని పేర్కొన్నారు. యోగా అనేది ఒక ప్రాంతానికో లేదా ఒక మత విధానానికో సంబంధించింది కాదనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలవారూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హిందూ స్వయం సేవక్ అమెరికా, కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఏకల్ విద్యాలయ, ఇండియన్ బిజినెస్ కమ్యూనిటీ, సేవ అమెరికా, విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ మిత్ర బృందం, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇషా యోగ, సహజ యోగ, సేవా ఇంటర్నేషనల్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా, విహంగం యోగ, అమెరికన్ తెలుగు అసోసియేషన్లతో పాటూ మిగితా స్థానిక కమ్యూనిటీ సంస్థలు పాల్గొన్నాయి. ఆదివారం జరిగిన యోగా కార్యక్రమంలో నిమేష్ దీక్షిత్, గణేష్, కేశవ్ దేవ్, రఘు, అభిమన్యు, రఘు రామ్, పూస్ఫజ్, విజయ్ మల్లంపాటి, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్, హరి, దీపు ఇతరులు పాల్గొన్నారు.