
దుబాయ్ లో ఘనంగా 'వేవ్' వార్షికోత్సవ సంబురాలు
దుబాయిలో తెలుగు వారి ఆత్మీయ వారధి వేవ్ 8 వ వార్షికోత్సవ సంబరాలు ఇక్కడి స్థానిక రషీద్ ఆడిటోరియంలో జూన్ 5 న వైభవంగా జరిగాయి.
దుబాయి: దుబాయిలో తెలుగు వారి ఆత్మీయ వారధి వేవ్ 8 వ వార్షికోత్సవ సంబరాలు ఇక్కడి స్థానిక రషీద్ ఆడిటోరియంలో జూన్ 5 న వైభవంగా జరిగాయి. సహజ నటి జయసుధ, అలనాటి తార రజని, యువ కథా నాయకుడు నారా రోహిత్ పాల్గొన్నారు. ముందుగా రోహన్ సాయి గణపతి స్తోత్రం తో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు యాంకర్ శ్రీవాణి వ్యాఖ్యాత గా వ్యవహరించారు. వేవ్ కార్య వర్గ సభ్యులు అంతా కలిసి శ్రీమతి జయసుధని వేదికపైకి తోడ్కొని రాగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రముఖ శాస్త్రీయ నాట్య కళా కారుడు శ్రీ మాధవపెద్ది మూర్తి గారి నృత్య రూపకాలు ఆహుతులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. జగదానంద కారక , దశావతారం రూపకాలని అభినయిస్తున్నపుడు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. కేవలం స్థానికంగా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులతోనే ఈ నృత్యాలన్నీ అభినయించటం విశేషం.
వై ఓన్లీ స్విమ్ వెన్ యు కెన్ డాన్స్ అంటూ కొరియో గ్రాఫర్ జాలీ రూపొందించిన చేపల నృత్య రూపకాన్ని చిన్నారులంతా చేపల వేషాల్లో అభినయించటం ఆకట్టుకుంది. సుధీక్షణ చేసిన అరబిక్ నృత్యం, విశాఖ వర్మ రూపొందించిన ఫాన్ డాన్స్ ఆహుతుల్ని అలరించాయి. కుశిత్, కుష్మత్, శివ పాటలు నృత్యాలతో సభికుల కరతాళ ధ్వనుల్ని అందుకున్నారు. అన్నమయ్య పాటతో రూపొందించిన బాలలే ఈ కార్యక్రమంలో మరో ముఖ్య ఆకర్షణ. నారా రోహిత్ మాట్లాడుతూ.. తన సినిమా విడుదల రోజున ఇండియాలో లేకపోవటం ఇదే తొలిసారి అన్నారు. ప్రేక్షకులంతా 'అసుర' సినిమా డైలాగ్ చెప్పమని కోరటంతో అనర్గళంగా ఓ డైలాగ్ చెప్పటంతో ప్రేక్షకులంతా విజిల్స్ వేశారు. మహిత దువూరి, మంజుల తదితరులు ప్రదర్శించిన లంబాడ నృత్యం, పలు సినిమా గీతాలకి చిన్నారులు, పెద్దలు అభినయించిన నృత్యాలు ఆహుతులని అలరించాయి.
సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 11 గంటల దాకా కొనసాగింది. వచ్చిన ప్రేక్షకులంతా చివరి వరకు ఉండి అన్ని కార్యక్రమాలని వీక్షించి తమ అభినందలని తెలియచేయటం విశేషం. ఎనిమిదేళ్లుగా తెలుగు కార్యక్రమాలని దుబాయిలో నిర్వహిస్తూ.. ఇక్కడి తెలుగు వారికి మన సంస్కృతీ సాంప్రదాయాలను చేరువ చేస్తున్న 'వేవ్ సంస్థ'ని, సంస్థ నిర్వహిస్తున్న శ్రీమతి గీత, శ్రీ రావెళ్ళ రమేష్ బాబుని, వేవ్ సంస్థలో భాగస్వాములైన ప్రతి సభ్యుడికి జయసుధ శుభాకాంక్షలు తెలియజేశారు. రజని మాట్లాడుతూ.. దుబాయిలో ఇంతమంది తెలుగువారి మధ్య గడపటం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్యకి అధ్యక్షుడుగా ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకి ఎన్నికైన రావెళ్ళ రమేష్ బాబుకి అంతా తమ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమ కమిటీ సభ్యులుగా శ్రీమతి ఉమా పద్మనాభన్, సునీత, సుధ, త్రివేణి, విశాల, లావణ్య, ప్రశాంతి, మధు శ్రీనివాస్, ప్రసన్న, స్వాప్నిక, దివ్య, మోనిష వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.