అమెరికాలో 'సేవ్ డెమొక్రసీ' | save democracy meeting in washington dc | Sakshi
Sakshi News home page

అమెరికాలో 'సేవ్ డెమొక్రసీ'

Published Tue, May 3 2016 7:20 PM | Last Updated on Tue, May 29 2018 2:33 PM

అమెరికాలో 'సేవ్ డెమొక్రసీ' - Sakshi

అమెరికాలో 'సేవ్ డెమొక్రసీ'

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 'వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' ఆధ్వర్యంలో ఆదివారం 'సేవ్ డెమొక్రసీ' సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లోపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారమని శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లను కట్టడి చేయకుంటే వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, తాగునీటి ఎద్దడితోపాటు అవినీతి తదితర సమస్యలపై తమ పార్టీ ప్రజల తరపున నిలదీస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.

'తిరుగులేని నాయకత్వ పటిమ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిజాయతీ గల ఎమ్మెల్యేగా తాను ప్రజల్లో ఉన్నానని... మీ ప్రలోభాలకు తలొగ్గి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా చరిత్రలో మిగిలిపోతానని తనను పార్టీలోకి  రావాలంటూ సంప్రదించిన టీడీపీ నేతలకు స్పష్టం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్'  పుస్తకాన్ని శ్రీకాంత్ రెడ్డి విడుదల చేశారు.

ఈ పుస్తకం చంద్రబాబు అవినీతి కుంభకోణాలకు అక్షర రూపమని పేర్కొన్నారు. తాము చెప్పేదే వేదం, చేసేదే అభివృద్ధి అంటూ మూర్ఖంగా ముందుకు పోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక గుణపాఠం నేర్పుతారని టీడీపీ నేతలను శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా ఎన్‌ఆర్‌ఐ కమిటీ అడ్వైజర్ అండ్ మిడ్ అట్లాంటిక్ రీజియన్ ఇన్‌చార్జ్ వల్లూరు రమేష్ రెడ్డి, సెంట్రల్ రీజియన్ ఇన్ ఛార్జ్ శ్రీ సురేష్రెడ్డి బత్తినపట్లతోపాటు వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్ఆర్ఐ క‌మిటీ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల, స్టూడెంట్ వింగ్ లీడర్ సాత్విక్ రెడ్డి, పలు రాష్టాల నుంచి విచ్చేసిన తెలుగు ఎన్ఆర్ఐలు, విద్యార్థులు, వైఎస్‌ఆర్ అభిమానులు, వైఎస్‌ఆర్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలో మెట్రో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరును సురేష్రెడ్డి బత్తినపట్ల వివరించారు. అలాగే ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్న క్రమంలో పొందిన అనుభవాలను ఈ కార్యక్రమానికి హాజరైన వారితో  పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కాగానే దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement