90 గంటలలో 108 శివాలయాల సందర్శన
విలేకరుల సమావేశంలో పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు
రాజమహేంద్రవరం కల్చరల్ : జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి నాలుగు దిక్కులలో నెలకొని ఉన్న 108 ప్రముఖ శివాలయాలను 90 గంటలలో సందర్శించడానికి భీమ సందర్శన రథ యాత్రను నిర్వహించనున్నట్టు శ్రీమహాలక్ష్మీసమేత చిన్నవేంకన్నబాబు స్వామివారి పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు తెలిపారు. బుధవారం సీతంపేటశాఖాగ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 24వ తేదీ దేవీచౌక్ అమ్మవారిని దర్శించుకుని ద్రాక్షారామం చేరుకుంటామని, 25ఉదయం ఆరు గంటలకు ద్రాక్షారామం నుంచి యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. గత ఏడాది నవంబర్ 26న 108 గంటల్లో 108 శివాలయాలను సందర్శించాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నామని, 82 గంటల్లో పూర్తి చేయగలిగామని తెలిపారు. ఈ ఏడాది 108 శివాలయాలను 90 గంటల్లోపు పూర్తి చేయాలనుకుంటున్నామని, ఆలయాలు తెరచి ఉండే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ లక్ష్యాన్ని నిర్దేశించామని ఆయన అన్నారు. ద్రాక్షారామభీమేశ్వరాలయం కేంద్రబిందువుగా నలుదిక్కులలో 108 ప్రముఖ శివాలయాలు ఉన్నాయని ద్రాక్షారామ ఆలయంలోని ఒకపురాతన పానవట్టం తెలియచెబుతోందని చిన్న వేంకన్నబాబు వివరించారు. జాతకరీత్యా 27నక్షత్రాలకు ఒకొక్కదానికి నాలుగు రాసుల చొప్పున ఉన్న 108 రాసులకు ఈ ఆలయాలు ప్రతీకలని వివరించారు. రాష్ట్ర అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి
కేవీఆర్‌ఎస్‌ఎన్ ఆచార్యులు, చవ్వాకుల శ్రీనివాస్, కల్లూరి సూర్యనారాయణ శర్మ,
సీతంపేట శాఖాగ్రంథాలయాధికారి నల్లమిల్లి రామకోటేశ్వరరావు, అర్చకులు పాల్గొన్నారు.