
పోస్టుమార్టం కోసం 14కి.మీ. నడక
ఆ గిరిజన పల్లెల్లో వైద్యానికే కాదు పోస్ట్‌మార్టం కోసమూ కష్టాలు తప్పడంలేదు.
- చెరువులో పడి బాలిక మృతి
- కొద్ది దూరం మోసుకొని.. ఆ తరువాత బైక్‌పై ఆస్పత్రికి మృతదేహం తరలింపు
పాడేరు: ఆ గిరిజన పల్లెల్లో వైద్యానికే కాదు పోస్ట్‌మార్టం కోసమూ కష్టాలు తప్పడంలేదు. అయిన వారు చనిపోరుున బాధను దిగమింగుకుంటూ కిలోమీటర్ల కొద్దీ దూరం మృతదేహాన్ని మోసుకొచ్చిన తీరు చూపరులకు కంట తడిపెట్టించింది. విశాఖ జిల్లా పాడేరు మండలం వంజంగి పంచాయతీ పోతురాజుమెట్టలో కొర్‌ర సంధ్య అనే ఐదేళ్ల చిన్నారి శుక్రవారం సాయంత్రం పూలుకోయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు పంట చెరువులో పడిపోరుుంది. కొన ఊపిరితో ఉన్న బాలికలను బైటకు తీశారు. 108 ద్వారా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మారుమూలన ఉన్న ఈ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో వాహనం రాలేదు. సకాలంలో వైద్యం అందక కొద్ది సేపటికే బాలిక తుది శ్వాస విడిచింది. ప్రమాదవశాత్తు మృతి చెందినందున బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి వచ్చింది. మరో మార్గంలేక బాలిక మేనమామ సుమారు 14 కి.మీ. దూరంలో ఉన్న పాడేరు ఏరియా ఆస్పత్రికి శనివారం ఉదయం మృతదేహం మోసుకుంటూ బయలు దేరాడు. ఇది తెలిసిన మరో బంధువు బైక్ తీసుకురావడంతో చివరలో బైక్‌పై తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆస్పత్రికి వెళ్లి బాలిక కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.