ప్రజావాణికి 178 ఫిర్యాదులు | 178 applications for greevens day | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 178 ఫిర్యాదులు

Published Mon, Sep 12 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

వినతులు స్వీకరిస్తున్న డీఆర్వో భాస్కర్‌

వినతులు స్వీకరిస్తున్న డీఆర్వో భాస్కర్‌

 వినతులు స్వీకరించిన డీఆర్వో భాస్కర్‌  
 సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు 
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: కలెక్టరేట్‌ ప్రాంగణంలోని రెవెన్యూ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో ప్రజలు తరలివచ్చారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఫిర్యాదుదారులు తమ గోడువెళ్లబోసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్, డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌నాయక్,  మెప్మా పీడీ లింగ్యానాయక్‌ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనలో తమ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయాలని,  భూముల సమస్యలు, కబ్జాలు, స్కాలర్‌షిప్‌లు, రుణాలు, ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని వినతులు వచ్చాయి. ఈ వారం ప్రజావాణికి మొత్తం 178 ఫిర్యాదులు, వినతులు అందాయి. అందులో ఆన్‌లైన్‌ పరిష్కారం కార్యక్రమానికి 5, ప్రజావాణికి 173 ఫిర్యాదులు వచ్చాయి. 
 
 
 
ఇంగ్లిష్‌ టీచర్‌ను కేటాయించాలి
స్కూళ్లు ప్రారంభమై మూడు నెలలు గడిచినా తమకు ఇంగ్లిష్‌ పాఠాలు ప్రారంభం కాలేదని, ఇంగ్లిష్‌ టీచర్‌ను నియమించాలని కోరుతూ కోయిలకొండ జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు వేడుకున్నారు. తమ పాఠశాలలో పని చేస్తున్న ఇంగ్లిష్‌ టీచర్‌ సరితను జిల్లాకేంద్రంలో బీఈడీ కళాశాలకు డిప్యూటేషన్‌ ఇచ్చారని, ఆమె డిప్యూటేషన్‌ రద్దు చేసి, ఇంగ్లిష్‌ టీచర్‌ను కేటాయించాలని కోరారు. 
 
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఇప్పించండి 
మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్‌పల్లి శివారులో ఆదర్శనగర్‌ కాలనీ వద్ద సర్వే నెం.523లో 2012లో ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హౌసింగ్‌ అధికారులు ఒరిజినల్‌ పట్టా సర్టిఫికెట్లు తీసుకున్నారు. తమకు ఇళ్ల పట్టాలు తిరిగి ఇప్పించి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయాలి. ఈ విషయంపై హౌసింగ్‌ పీడీని అడిగితే స్పందించలేదని చెప్పారు. 
 
కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ.. 
కోర్టు పరిధిలో భూమిపై కేసు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు తమ భూమిని కబ్జా చేస్తూ ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని నాగర్‌కర్నూల్‌ మండలం నల్లవెల్లికి చెందిన నాగలక్ష్మి, కవిత ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్‌ 248లో నాలుగు ఎకరాల భూమిని తమ నుంచి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 
విధుల్లోకి తీసుకోవాలి 
నాలుగేళ్లుగా మున్సిపల్‌ కార్మికులుగా పనిచేస్తున్న తమను అకారణంగా తొలగించారు, తమను విధుల్లోకి తీసుకోవాలని 30 మంది కార్మికులు వేడుకున్నారు. రెగ్యూలర్‌ చేస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. తమను తొలగించడంతో రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
 
 చెరువు భూమిని ప్లాట్లు చేస్తున్నారు 
మక్తల్‌ మండలం పులిమామిడి వద్ద సర్వే నం.455లో చెరువు భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన బి.జయరాజు కోరారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 
వనపర్తిలోనే కొనసాగించాలి
జిల్లాల పునర్విభజనలో బాగంగా పెబ్బేరు మండలాన్ని వనపర్తి ఐసీడీఎస్‌ ప్రాజెక్టులోనే కొనసాగించాలని పెబ్బేరు మండలానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు విన్నవించారు. ఆత్మకూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో కలుపుతున్నట్లు తెలుస్తోందని, తమకు ఆత్మకూర్‌ చాలా దూరమవుతుందని పేర్కొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement