వినతులు స్వీకరిస్తున్న జేసీ ఎం.రాంకిషన్
-
ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించాలని వినతి
-
ఫిర్యాదులు స్వీకరించిన జేసీ రాంకిషన్
-
ఈ వారం మొత్తం ఫిర్యాదులు 176
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో ప్రజలు తరలివచ్చారు. కృష్ణా పుష్కరాలు నేపథ్యంలో నాలుగు వారాలుగా ప్రజావాణిని రద్దు చేశారు. దీంతో ప్రజలు తమ పిర్యాదులు, వినతులు సమర్పించేందుకు సోమవారం కలెక్టరేట్‌కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు ఫిర్యాదుదారులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. జేసీ ఎం.రాంకిషన్, డీఆర్వో భాస్కర్, మెప్మా పీడీ లింగ్యానాయక్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూముల సమస్యలు, కబ్జాలు, రుణాలు, ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ వినతులు వచ్చాయి. ఈ వారం ప్రజావాణికి వినతులు, ఫిర్యాదులు 170, ఆన్‌లైన్ పరిష్కారం కార్యక్రమానికి ఆరు ఫిర్యాదులు వచ్చాయి.
నా పింఛన్ వేరే వాళ్లు తీసుకుంటున్నారు
‘మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా పనిచేస్తున్న నా భర్త ఎ.చిన్ననర్సయ్య అనారోగ్యం మృతి చెందాడు. ప్రభుత్వం నుంచి వచ్చిన బెనిఫిట్లన్నింటిని వీరన్నపేటకు చెందిన లక్ష్మయ్య, సిద్ధయ్య కాజేశారు. నాకు రావాల్సిన పింఛన్ కూడా వాళ్లే తీసుకుంటున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాను. పెద్దదిక్కు కోల్పోయిన నాకు సాయం చేయండి.’
– ఎ.నాగమ్మ, మహబూబ్‌నగర్
సారాయి మానేశాం.. ఉపాధి చూపండి
‘సారాయి తయారు చేసి అమ్ముకుని ఇంతకాలం జీవనం సాగించాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మేము పూర్తిగా సారాయి వృత్తిని మానేశాం. ఇప్పుడు మాకు ఉపాధి లేదు. బ్యాంక్ నుంచి రుణాలిచ్చి, ఆర్థిక సహాయం చేస్తే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని బతుకుతాం. దయ చూపండి సారూ’ అని తిమ్మాజిపేట మండలం పుల్లగిరికి చెందిన ముడావత్ మారు, ముడావత్ నీల, జయమ్మ, బన్నీబాయి వేడుకున్నారు.
లీజును రద్దు చేయాలి
పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ శివారులో సర్వే నం.521లో ఎస్వీఆర్ మినరల్స్ కంపెనీకి ఇచ్చిన 39ఎకరాల సున్నపురాయి లీజును రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ సత్యంసాగర్, రాజు, దామోదరచారి విన్నవించారు. లీజును రద్దు చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కొందరు వ్యక్తుల ప్రోత్సాహంతో అక్రమంగా బ్లాస్టింగులు చేస్తూ దొంగచాటున సున్నపురాయిని తీసుకెళుతున్నారని ఆరోపించారు.
పేపర్‌మిల్లును తొలగించాలని..
కొత్తూరు మండలం సోదాపూర్ గ్రామ శివారులో ఉన్న పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పంటలు నష్టపోతున్నామని, పేపర్ మిల్లును తొలగించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన జైపాల్‌రెడ్డి, జంగారెడ్డి, రవీందర్, మరో పదిమంది జేసీకి విన్నవించారు.
గుంపు మేస్త్రీపై చర్య తీసుకోవాలి
గుంపు మేస్త్రీల చెర నుంచి వలస కార్మికులను విడిపించాలని, చట్టవిరుద్ధంగా వలసలు తీసుకెళ్తున్న అమరచింతకు చెందిన గొల్లరాములు, కొంకనోనిపల్లికి చెందిన బోయ చెన్నప్పలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న రాత్రి ఒక వాహనంలో కూలీలను తరలిస్తుండగా చిన్నచింతకుంట తహసీల్దార్‌కు సమాచారమిచ్చినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు.