వినతులు స్వీకరిస్తున్న డీఆర్వో భాస్కర్
-
ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు
-
దరఖాస్తులు స్వీకరించిన డీఆర్వో భాస్కర్
-
ఈవారం మొత్తం వినతులు, ఫిర్యాదులు 209
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ‘తిరిగి తిరిగి అలిసిపోతున్నాం... మా గోడును జర పట్టించుకోండి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మేము ఇక్కడికి వస్తుంటే.. మీరు మళ్లీ అక్కడికే రాస్తున్నారు.. వారేమో పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయండి సారూ’ అని పలువురు పింఛన్‌దారులు, భూములకు సంబంధించిన వివాదాలపై ప్రజలు అధికారులను వేడుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు, వినతులు వెల్లువెత్తాయి. జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్, డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌నాయక్, మెప్మా పీడీ లింగ్యానాయక్, తదితరులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనలో తమ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయాలని, భూముల సమస్యలు, కబ్జాలు, స్కాలర్‌షిప్‌లు, రుణాల సమస్యను పరిష్కరించాలని, ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని చాలా వినతులు వచ్చాయి. ఈ వారం ‘పరిష్కారం’ ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పది, ప్రజావాణికి 199, మొత్తం 209 వినతులు, ఫిర్యాదులు అందాయి.
ఎవరూ పట్టించుకోరెందుకయ్యా..
ఐదు నెలలుగా స్థానిక అధికారుల వద్దకు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇదివరకే ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించుకోరెందుకయ్యా.. ఆధారం లేక బతకలేకపోతున్నాం. ఇప్పుడైనా పింఛన్ మంజూరు చేయించి, మాకు న్యాయం చేయండి సారూ.. అని చిన్నచింతకుంట మండలం దూపల్లికి చెందిన శాంతమ్మ, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిరకి చెందిన ఉప్పరి కాలమ్మ అధికారులను వేడుకున్నారు.
చదివించలేకపోతున్నాం ..
మా అబ్బాయి మహేశ్‌కుమార్‌కు వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మేము ఎంబీబీఎస్ చదివించలేకపోతున్నాం. మా అబ్బాయి చదువు పూర్తయ్యే వరకు ప్రభుత్వపరంగా ఆర్థికసాయం చేసి, ఆదుకోండి’ అని మానవపాడు మండలం పుల్లూరుకు చెందిన ఎం.శారద అధికారులను కోరారు.
పంటలు మునిగాయి.. ఆదుకోండి
మక్తల్ మండలం అంకెన్‌పల్లి చెరువు వెనుకభాగంలో తాము వేసిన పంటలు ముంపునకు గురయ్యాయి. తమకు ప్రత్యామ్నాయం చూపి ఆదుకోవాలని అనుగొండ రైతులు మునిగిన కంది పంటను తీసుకొచ్చి ప్రజావాణిలో అధికారులకు చూపించి సమస్యను వివరించారు. వరి, కంది పంటలు పూర్తిగా నీటిలో మునిగాయని, తమ సొంత భూముల్లో వేసుకున్న పంటలు మునిగి తీవ్ర నష్టం వస్తుందని వాపోయారు.
నష్ట పరిహారం ఇప్పించండి
‘సాగుచేసుకుని బతికేందుకు ప్రభుత్వం గతంలో భూమిలిచ్చింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్‌కు ఆ భూములను తీసుకున్నారు. ఒక్కొక్కరికి 3ఎకరాల చొప్పున మొత్తం 39ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది. మేము ఇంతకాలం ఆ భూములనే సాగు చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఆధారం కోల్పోతున్నాం. మాకు తగిన పరిహారం ఇప్పించి ఆదుకోవాలి.’ అని భూత్పూర్ మండలం కర్వెన కు చెందిన 13మంది రైతులు వేడుకున్నారు.