
ఒకేరోజు 2.50 కోట్ల మొక్కలతో వ్యవసాయ హరితహారం
19న ఏర్పాట్లు: మంత్రి పోచారం
కామారెడ్డి: ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. పొలంగట్లు, బంజరు భూముల్లో ఒక్కరోజులో 2.50 కోట్ల మొక్కలు నాటేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం నుంచి 9 జిల్లాల వ్యవసాయ, ఉద్యానవన, అటవీ, డ్వామా, సహకార శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలో 6 లక్షల 83 వేల హెక్టార్ల పడావు భూములు, లక్షా 72 వేల హెక్టార్ల సాగుయోగ్యం కాని భూములను హరితమయం చేసేందుకు సగటున ఎకరాకు 500 మొక్కల చొప్పున 110 కోట్ల మొక్కలు పెంచవచ్చన్నారు. ఒక్క వ్యవసాయశాఖ ద్వారానే 160 కోట్ల మొక్కలను పెంచడానికి అవకాశం ఉందన్నారు. మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేద్దామని అన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో 8,695 పంచాయతీల్లో ఒక్కో పంచాయతీకి 3 వేల మొక్కల చొప్పున నాటితే రాష్ట్రంలో రెండున్నర కోట్ల మొక్కలు పూర్తవుతాయన్నారు. కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రియదర్శిని, ఆయా జిల్లాల జేడీఏలు, డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.