
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రైతులకు సబ్సిడీపై ఐదువేల ట్రాక్టర్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాపార విస్తరణలో భాగంగా జాన్ డీర్ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం మంత్రి పోచారంతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ వ్యవసాయ పరికరాలపై దేశంలోనే అత్యధిక సబ్సిడీ అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గత ఏడాది రైతులకు సబ్సిడీపై 3వేల ట్రాక్టర్లు అందించామని ఆయన వెల్లడించారు.
వ్యవసాయ యాంత్రీకరణ వల్ల కూలీల కొరత తీరడంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. విత్తనం వేయడం నుండి పంట కోత వరకు అంతా యంత్రాలతోనే జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా, కంది ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయన్నారు. వరి కోత యంత్రాలు పూర్తిగా విజయవంతం అయ్యాయన్నారు. మిగతా పంటలకు కూడా కోత యంత్రాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్నకు కూలీల కొరత ఎక్కువగా ఉందన్నారు.
ఈ ఏడాది మొక్కజొన్న నూర్పిడి యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. కాగా, నాణ్యతతో పాటు అందుబాటు ధరలో యంత్రాలను రైతులకు అందించాలని ఆయన కంపెనీ ప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలో రైతుల అవసరాలకు అనుగుణంగా జాన్ డీర్ ఉత్పత్తులను అందిస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్, జాన్ డీర్ కంపెనీ ప్రతినిధులు డగ్లస్ రాబర్ట్స్, సతీశ్ నాడిగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment