Published
Fri, Sep 23 2016 10:10 PM
| Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
రైతులకు రూ.20 కోట్ల స్వల్పకాలిక రుణాలు
నల్లగొండ అగ్రికల్చర్ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా కొత్త రైతులకు రూ.20 కోట్ల స్వల్పకాలిక రుణాలను ఇవ్వనున్నట్లు డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు తెలిపారు. శుక్రవారం స్థానిక డీసీసీబీలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ నిధులు 25 శాతంలో సగం ప్రభుత్వం విడుదల చేసిందని మిగిలిన సగం నిధులు రాగానే అర్హత కలిగిన పాత రైతులకు స్వల్పకాలిక రుణాలను ఇవ్వనున్నామన్నారు. జిల్లాలో వృథాగా ఉన్న డీసీసీబీ ఆస్తులను ఆర్‌బీఐ అనుమతితో నిబంధనల ప్రకారం అమ్మవేసి వచ్చిన నిధులతో సొంత భవనాలను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో కొన్ని చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్‌ను మంజూరు చేశామన్నారు. దీర్ఘకాలిక రుణాలను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా ఇవ్వనున్నామన్నారు. 50 సంవత్సరాలు దాటిన రైతులకు కూడా ప్రధానమంత్రి బీమాయోజన పథకం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని 74 సహకార సొసైటీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1కోటి 40 లక్షలను విడుదల చేశామని తెలిపారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో సీఈఓ మదన్‌మోహన్, డైరెక్టర్లు గరిణె కోటేశ్వర్‌రావు, పాశం సంపత్‌రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్, చాపల లింగయ్య, రవీందర్‌రెడ్డి, రమణారెడ్డి, హరియానాయక్, పీర్‌నాయక్, గుడిపాలి వెంకటరమణ, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.