అమరావతిలో 2018 ఒలింపిక్స్
విస్తుపరిచిన సీఎం ప్రకటన
సాక్షి, విశాఖపట్నం : అమరావతిలో 2018 ఒలింపిక్స్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. శనివారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో నైట్ బే మారథాన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ అమరావతిలో ఆసియా గేమ్స్ జరగ నున్నాయని మొదట చెప్పిన ఆయన.. ఆ వెంటనే ఒలింపిక్స్ గేమ్స్ జరగబోతున్నాయన్నారు. దీంతో అంతా విస్తుపోయారు. వాస్తవానికి వచ్చే నెల 5న బ్రెజిల్ దేశంలో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.
ప్రతి నాలుగేళ్లకోసారి నిర్వహించడం, వేదికలను ముందే ఖరారు చేయడం ఆనవాయితీ. అలా 2020లో టోక్యోలో, 2024లో రోమ్‌లో వీటిని నిర్వహించాలని ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ ఖరారు చేసింది. అలాంటప్పుడు 2018లో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని సీఎం ఎలా ప్రకటించారో అర్థంగాక జనం తలలు పట్టుకున్నారు. అనంతరం 10కె రన్ విభాగంలో విజేతగా నిలిచిన తెలంగాణ లోని నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన యువతి నవ్యా పటేల్‌కు రూ.50 వేలను అందజేశారు.
పాల్మాన్‌పేట ఘటనపై విచారణ: సీఎం
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పాల్మాన్‌పేట ఘటనపై విచారణ జరిపిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం విశాఖ వచ్చిన చంద్రబాబును బాధితులు కలిసి వివరించారు.దీనికి స్పందించిన సీఎం ఘటనపై విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 వేలు చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని చెప్పారు.
కొత్తగా బోర్లు వేయకుండా నిషేధం
సాక్షి, విజయవాడ బ్యూరో: భూగర్భజలాలను పరిరక్షించేందుకు అవసరమైతే కొత్తగా బోర్లు వేయకుండా నిషేధం విధిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో వర్షపునీటి వినియోగం, భూగర్భజలాల గురించి మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైపుల నుంచి ఈనెల 6న పోలవరం కుడి కాలువకు గోదావరి నీటిని వదులుతామని సీఎం చెప్పారు. పాలార్ ప్రాజెక్టును ఇంకా మొదలు పెట్టకుండానే తమిళనాడు సీఎం జయలలిత దాన్ని కట్టొద్దని లేఖ రాశారన్నారు.