
ఇన్‌క్లైన్ భూగర్భ గని
- ఏడు నెలల్లో ముగియనున్న భూగర్భ గని జీవితకాలం
- బదిలీ భయంతో కార్మికుల ఆందోళన
- నూతన గని ప్రారంభించాలని డిమాండ్
ఇల్లెందుఅర్బన్: ఇల్లెందు ఏరియాలోని 21 ఇన్‌క్లైన్ భూగర్భ గని జీవితకాలం మరో ఏడు నెలల్లో ముగియనుంది. 2017 మార్చి నాటికి గనిలో ఉత్పత్తి నిలిచిపోనుంది. దీంతో కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. ప్రస్తుతం గనిలో 497 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గని జీవితకాలం ముగిసేనాటికి సుమారు 60 మందికి పైగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. మిగిలిన కార్మికుల్లో మాత్రం బదిలీ భయం పట్టుకుంది. ఏళ్లతరబడి స్థానికంగా పని చేసి దూరప్రాంతాలకు వెళ్లాల్సివస్తుందని ఆవేదన చెందుతున్నారు. యాజమాన్యం రెండేళ్ల నుంచి దశలవారీగా బదిలీ చేస్తూ కార్మికుల సంఖ్యను కుదించింది. గని జీవితం కాలం మరికొంత కాలం పెంచాలని, అది సాధ్యపడకపోతే నూతన గనిని ప్రారంభించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పలు విభాగాలకు ముప్పు
21 ఇన్‌క్లైన్ మూతపడితే సమీపంలోని వర్క్‌షాపు, ఆటోవర్క్‌షాపు, స్టోర్స్‌లతో పాటు ఏరియా వైద్యశాల తదితర విభాగాలకు ముప్పు వాటిల్లనుంది. గని మూతపడితే ఆయా విభాగాలు కూడా ఎత్తివేసే అవకాశం ఉందని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో కార్మికుల సంఖ్య 15 మంది కంటే మించిలేరు. మూతపడే నాటికి సగానికిపైగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందనున్నారు
ఎటు తేలని సొసైటీ అవినీతి
గని మరో ఏడు నెలల్లో మూతపడనుందని యాజమాన్యమే చెబుతోంది. రెండేళ్లుగా 21 ఇన్‌క్లైన్ సొసైటీ అవినీతిపై విచారణ జరుగుతోంది. అక్రమార్కులను ఇప్పటివరకు తేల్చలేదు. డిపాజిటర్లకు రావాల్సిన నగదును పూర్తిగా చెల్లించలేకపోయారు. వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. కొందరు అక్రమార్కులు చక్రం తిప్పుతూ గని మూతపడే వరకు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గని మూతపడితే తమ పరిస్థితి ఏమిటని డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు.
ఓపెన్‌కాస్టులే దిక్కు
ఇల్లెందు ఏరియాలో ఉన్న ఒకే ఒక్క అండర్ గ్రౌండ్‌మైన్ మూతపడటంతో కేఓసీ, జేకే–5 ఓసీల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగనుంది. యాజమాన్యం గని మూతపడిన అనంతరం మెగా ఓసీకి ప్రతిపాదనలు రూపొందిస్తోంది. మూతపడిన గని ప్రదేశాన్ని ఓసీగా మార్పు చేసి ఉత్పత్తి సాధించేందుకు చర్యలు చేపడుతున్నారు.
21 ఇన్‌క్లైన్‌కు చివరి గుర్తింపు ఎన్నికలు
సింగరేణిలో జరగనున్న ఈ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో 21 ఇన్‌క్లైన్ కార్మికులు ఓటు వేయనున్నారు. మళ్లీ జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి గని మూతపడి ఉంటుంది. మళ్లీ దఫా జరగనున్న ఎన్నికల నాటికి ఇక్కడి కార్మికులు వివిధ ప్రాంతాల్లో పని చేయనున్నారు.
గని జీవితకాలం పెంచాలి
గనిలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. మూసివేయడం సరికాదు. యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి మరో నాలుగైదేళ్లు గని జీవితం కాలం పెంచవచ్చు. కార్మికులను బదిలీ చేయొద్దు
–కె.సారయ్య, ఏఐటీయూసీ నేత
నూతన గనులు ప్రారంభించాలి
యాజమాన్యం నూతన గనుల ఏర్పాటు విషయమై ఆలోచించడంలేదు. గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు గని జీవితకాలాన్ని పెంచడంలో విఫలమయ్యారు. యాజమాన్యం పునరాలోచించి నూతన గనులను ప్రారంభించాలి.
–సత్యనారాయణ, హెచ్‌ఎంఎస్ నేత
యాజమాన్యానికి విన్నవించాం
ఇల్లెందు ఏరియాలో నూతన గనులు ప్రారంభించాలని యాజమాన్యానికి పలుమార్లు వినతి పత్రాలు అందజేశాం. ఇల్లెందు ఏరియాలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. 21ఇన్‌క్లైన్ గని జీవిత కాలం పెంచాలి. కార్మికులను బదిలీ చేయొద్దు.
–జగన్నాథం, టీబీజీకేఎస్ నేత