24 శాతం వరినాట్లు పూర్తి
24 శాతం వరినాట్లు పూర్తి
Published Thu, Jul 21 2016 4:02 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
lఆగస్టు 10 నాటితో నూరు శాతం నాట్లు
అందుబాటులో 67 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు
వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్
బిక్కవోలు :
జిల్లాలో ఇప్పటి వరకు 24 శాతం ఖరీఫ్ వరినాట్లు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు కేఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. బిక్కవోలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఖరీఫ్‌లో 2 లక్షల, 33 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరిసాగు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 54వేల,106 హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయన్నారు. ఇందులో 15 శాతం వెదజల్లు విధానంలో రైతులు వరిని సాగు చేస్తున్నారన్నారు. ఈ నెలాఖరుకు 90 శాతం, అగస్టు పదో తేదీలోగా వంద శాతం నాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే జిల్లాకు లక్షా,85 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని తెలిపారు. ప్రస్తుతం 67 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఫసల్ బీమాతో రైతులకు లబ్ధి
పంట రుణాలు తీసుకోని రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వరం లాంటిదని జేడీ తెలిపారు. ఎకరానికి కేవలం రూ.640 ప్రీమియం చెల్లిస్తే పంటను నష్టపోయినపుడు రూ.32 వేల వరకు పరిహారాన్ని పొందవచ్చన్నారు. పంట నష్టం లెక్కింపునకు ఇప్పటి వరకూ మండలాన్ని యూనిట్‌గా తీసుకునేవారని ఈ పథకంలో మాత్రం గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటారని వెల్లడించారు. జిల్లాలో లక్షా 32 వేల రుణఅర్హత కార్డుదారులు ఉన్నారని చెప్పారు. వారికి రూ.4250 కోట్ల పంట రుణంగా అందించవలసి ఉండగా ఇప్పటి వరకు రూ.850 కోట్లు ఇప్పించామన్నారు. పప్పుధాన్యాల దిగుబడి పెంచడంలో భాగంగా రైతులు పొలం గట్లపై చల్లుకోవడానికి కంది విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. ఇందుకోసం 40 వేల హెక్టార్లలో సాగుకు సరిపడా కంది విత్తనాలను ఇప్పటికే మండల కేంద్రాలకు పంపించామని చెప్పారు. అలాగే సూక్ష్మ పోషకాలైన జింకు, బోరాన్, జిప్సంలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామని తెలిపారు.
ఖరీఫ్ సీజన్‌లో రైతులు స్వర్ణేతర విత్తనాలను మాత్రమే సాగు చేయాలని జేడీ ప్రసాద్ సూచించారు. ఈ సీజన్లో వర్షాలు, గాలి దుమారాలకు స్వర్ణ రకం నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్న దృష్ట్యా ప్రభుత్వం ఇతర రకాల వరి విత్తనాలకు సబ్సీడీ ఇచ్చి ప్రోత్సహిస్తోందన్నారు.
Advertisement