- సూర్యారావుపేట బీచ్‌లో ముగ్గురి మృతి
- ఇద్దరు గల్లంతు, ముగ్గురికి తీవ్ర అస్వస్థత
- అమ్మవారి దర్శనానికి వెళ్లిన కుటుంబాల్లో ఆవేదన
కాటేసిన కడలి
Published Thu, Apr 6 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
కాకినాడ రూరల్ :
కాంట్రాకోట నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో మొక్కుబడులు చెల్లించుకొని సముద్రస్నానం కోసం వెళితే సముద్రుడు తమ కుటుంబాలను తీసుకెళ్లిపోయాడంటూ ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు, చెల్లెల కుటుంబాల్లో విషాదం నెలకొంది. లేకలేక పుట్టిన కుమారుడు, కుమారైలను సముద్రుడు తీసుకుపోయాడని, ఇక బతకడం అనవసరంటూ పితాని గోవిందు, పద్మ విలపిస్తున్న తీరు సంఘటనా స్థలంలోని వారందరినీ కంటతడి పెట్టించింది. సముద్రానికి వెళ్లిన కుటుంబం ప్రమాదం జరిగిందని టీవీల్లోనూ, పేపర్లోనూ చూశామని, ఇప్పుడు తమ కుటుంబమే ఇలా అయిపోతుందని కలలో కూడా ఊహించలేదంటూ వారు బోరున విలపించారు. ఇలా జరుగుతుందని తెలిస్తే అమ్మవారి ఆలయానికి వెళ్లేవారమే కాదని, ఎండ తీవ్రత వల్ల సముద్రస్నానం చేసిన తరువాత తింటామని చెప్పిన కుటుంబ సభ్యులు సముద్రుడికి భోజనం అయిపోయారంటూ గుండెలవిసేలా రోదించారు.
తాళ్లరేవు మండలం సుంకరపాలెం (కాపులపాలెం) పితానివారిపేటకు చెందిన అన్నదమ్ములు పితాని గోవిందు, పితాని శ్రీను కుటుంబాలు, వారి చెల్లెలు శీలం తనుకులమ్మ కుటుంబం మొత్తం 18 మంది సభ్యులు టాటా ఏసు గూడ్స్ ఆటోలో పెద్దాపురం నియోజకవర్గంలోని కాండ్రకోట నూకాలమ్మతల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. అమ్మవారి మొక్కులు తీర్చుకొని తిరుగు ప్రయాణంలో సముద్రస్నానం కోసం సూర్యారావుపేట బీచ్‌కు 3.30 గంటల సమయంలో వచ్చారు. పిల్లలకు పరీక్షలు అవ్వడం, పొంగు చూపితే నూకాలమ్మకు మొక్కు చెల్లించుకోవడం వారికి ఆనవాయితీ.
ఈ ప్రమాదంలో పితాని గోవిందు కుటుంబానికి చెందిన పితాని అనిత (16), పితాని రమ్య (18), పితాని వీరవంశీ (14), పితాని శ్రీను కుటుంబానికి చెందిన పితాని జయకృష్ణ (20), శీలం తనుకులమ్మ (30), శీలం దేవి (16) సముద్రంలోకి దిగిన వెంటనే ఓ రాకాసి అల వీరిని లోపలికి లాగేసుకుంది. సముద్రం ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులు చూస్తుండగానే వీరంతా మునిగిపోయారు. వారిని రక్షించేందుకు పితాని శ్రీను (36) సముద్రంలోకి దిగి సముద్రంలో కొట్టుకుపోయాడు.
రక్షించేందుకు పర్యాటకుల ప్రయత్నం
బీచ్‌కు వచ్చిన పర్యాటకులకు ఫొటోలు తీసే ఉప్పాడకు చెందిన యువకులు.. కొట్టుకుపోతున్న ఆరుగురిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో ఇద్దరు దొరకలేదు. సముద్రంలో ముగినిపోయిన వ్యక్తులు అప్పటికే పూర్తిగా నీరు తాగేయడంతో మత్స్యకారులు ప్రాథమిక చికిత్స చేస్తుంటే పితాని శ్రీను, పితాని అనిత, శీలం దేవి మరణించారు. శీలం తనుకులమ్మ, రమ్య, శ్రీనులను హుటాహుటీన కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పితాని జయకృష్ణ (20), పితాని వీరవంశీ (14) సముద్రంలో గల్లంతయ్యారు.
సంఘటన స్థలానికి చేరిన అధికారులు
ఐదుగురు వ్యక్తులు సముద్రంలో గల్లంతయ్యారన్న సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్, ఎస్పీ రవి ప్రకాష్, ఆర్డీఓ రఘుబాబు, తహసీల్దార్ జె.సింహాద్రి, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, రూరల్ సీఐ వి.పవన్ కిశోర్, కోస్టుగార్డు సిబ్బంది, మెరైన్ పోలీసులు, డిజార్డ్ మేనేజ్‌మెంట్ సంస్థ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 6 గంటల వరకు గల్లంతైన వారి ఆచూకీ తెలియకపోవడంతో మత్స్యకారులను రప్పించి అలివి వలను వేయించి గాలింపు చర్యలను చేపట్టారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ దగ్గరుండీ పరిస్థితిని సమీక్షించారు.
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : కన్నబాబు
బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పరామర్శించారు. బీచ్‌ను తన హయాంలోనే అభివృద్ధి చేశామని, బీచ్‌కు వచ్చే పర్యాటకులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలమైందన్నారు. బీచ్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. సముద్రంలో డెజ్జింగ్ చేయడం వల్ల సముద్రతీరం కోతకు గురైందని, ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టాలి్సన అవసరం ఉంది. మూడేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో 21 మంది మృత్యవాత పడినట్టు రికార్డులున్నాయన్నారు. బీచ్‌లో చనిపోయిన కుటుంబాలు పేద కుటుంబాలు కావడంతో వారికి ప్రభుత్వపరంగా నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆరుగురిని రక్షించి తీసుకొచ్చా..
సముద్రంలో మునిగిపోతున్న ఆరుగురు వ్యక్తులను రక్షించి బయటకు తీసుకొచ్చాను. వారికి వైద్యం అందడంలో ఆలస్యం అవ్వడంతో వారిలో ముగ్గురు వ్యక్తులు బయటకు తెచ్చిన అర్థగంట సమయంలోనే చనిపోవడం తనను కలచివేసింది. ఆరుగురు వ్యక్తులను రక్షించానన్న ఆనందం ఆవిరైపోయింది. గల్లంతైన ఇద్దరు యువకులను రక్షించేందుకు విశ్వప్రయత్నం చేశాను. చేతిని అందుకునే లోపే మరో రాకాసి అల వచ్చి అతనితో పాటు నన్ను లోపలికి తీసుకుపోయింది. అతికష్టం మీద బయటకు వచ్చారు. తనతో పాటు ఐస్ అమ్ముకునే గొర్ల సూరిబాబు, సూర్యారావుపేటకు చెందిన ఫొటోగ్రాఫర్లు ఎస్ నూకరాజు, సునీల్ కూడా సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తులను రక్షించే ప్రయత్నం చేశారు.
– చోడిపల్లి దేవుడు, పర్యాటకుల ఫొటోలు తీసే వ్యక్తి
Advertisement
Advertisement