మళ్లీ టెన్షన్..!
- 5 వేల ఎకరాల భూసేకరణకు రంగం సిద్ధం
- ఆందోళనలో అన్నదాతలు
పెనుకొండ: కియాకార్ల పరిశ్రమ కోసం పెనుకొండ మండలం ఎర్రమంచి, అమ్మవారుపల్లి పొలాల్లో మొదట విడతలో 193 మంది రైతుల నుంచి 600 ఎకరాలు భూమిని సేకరించారు. ఈ ప్రాంతంలో కార్ల పరిశ్రమ పనులు జరుగుతుండగా... ఏకంగా మరో 5 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎమ్మెల్యే బీకే సార్థసారధే ఈ విషయాన్ని చెప్పారు. సీఎం దీనికి ఆమోద ముద్ర వేశారని, రైతులందరూ సహకరించాలంటున్నారు. ఇప్పటికే భూసేకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
స్థానిక ఆంజనేయస్వామి ఆలయం నుంచి గొందిపల్లి సమీపంలో ఉన్న భూములతో పాటు ఆ ప్రాంతంలోని మిగిలిన భూములు రాంపురం గ్రామ వెనుక భాగంలో అంటే ఎర్రమంచి , మోట్రుపల్లి, చినపరెడ్డిపల్లి ప్రాంతాలకు చెందిన భూములన్నీ భూసేకరణకు వెళ్ళనున్నాయని ఎమ్మెల్యే మాటలు చెప్పకనే చెబుతున్నాయి. ఇక గుట్టూరు ప్రాంతంలో సైతం విలువైన భూములను ప్రభుత్వం సేకరించనున్నట్లు తెలుస్తోంది. సోమందేపల్లి మండలంలో సైతం పలు ప్రాంతాల్లో విలువైన భూములను సేకరించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కియా చదును పనులు ఆగస్టులోగా పూర్తీ కానుండటంతో 2వ విడత పనులు ఊపందుకోనున్నాయి.
రైతుల్లో ఆందోళన..
ఉన్న భూములన్నీ పోతే ఏం చేయాలన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. కియా కార్ల కంపెనీ కోసం ప్రస్తుతమున్న భూమిని చదును చేసేందుకు ఎకరాకు ఏకంగా రూ. 29.74లక్షలతో రూ. 177 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేయిస్తోంది. ఇందులో భారీ స్కాం దాగి ఉందనే విమర్శలు వస్తున్నా అదే తరహాలో మరోసారి భారీ భూసేకరణ, చదును పనులతో మరో దోపిడీకి తెరతీసేందుకు సిద్ధమవుతోందన్న ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న టీడీపీ పెద్దల భూములను ప్రభుత్వం సేకరిస్తుందా? లేక సామాన్య రైతుల భూములను మాత్రమే తీసుకుంటుందా? అన్న చర్చ సైతం జోరుగా సాగుతోంది.
రిజర్వాయర్ నిండుతుందా?
గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో రైతులకు మేలు జరుగుతుందని రైతులు కలలు గంటున్న తరుణంలో భూసేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిపై వ్యతిరేకత వచ్చినా భూసేకరణ చేపట్టింది. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సైతం దీనికి తీవ్రంగా ఖండించారు. అమ్మవారుపల్లిలో సభ నిర్వహించి రైతులకు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. అప్పట్లో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మరోసారి భారీ భూసేకరణకు సిద్ధమవడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా రిజర్వాయర్‌ను తూతూ మంత్రంగా నీటితో నింపి కియా యాజమాన్యాన్ని నమ్మించిన ప్రభుత్వం అనంతరం నీటిని గొల్లపల్లి రిజర్వాయర్‌కు వదలకుండా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి వస్తున్న నీటిని నేరుగా ఇతర ప్రాంతాలకు ఇష్టారాజ్యంగా వదుతున్నారు.
రొద్దం ప్రాంతంలో భారీ భూసేకరణ
రొద్దం మండలంలో సైతం ప్రభుత్వం భారీ భూసేకరణకు సిధ్ధమైంది. ఇందులో భాగంగా ప్రారంభంలో బొక్కసంపల్లి వద్ద ఉన్న భూములను సేకరించనున్నట్లు ఎమ్మెల్యే బీకే పార్ధసారధి చెబుతున్నారు. అనంతరం చుట్టు పక్కల పున్న గ్రామాల భూములను సైతం ప్రభుత్వం సేకరించనున్నట్లు చర్చ నడుస్తోంది.
కమీషన్ల కోసమే...
- శ్రీకాంతరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్
5 వేల ఎకరాల భూసేరణ అంటే ప్రతి రైతు భయపడే చర్య ఇది. రిజర్వాయర్ పనులను ఆఘమేఘాల మీద చేపట్టిన ప్రభుత్వం రైతుల భూములను తీసుకుని కమీషన్ల దందాకు పాల్పడాలన్న ఉద్ధేశ్యం బయట పడుతోంది .
అంతా పథకం ప్రకారమే..
- వెంకటప్ప, మునిమడుగు
ప్రభుత్వం పథకం ప్రకారం భూములను తీసుకుంటోంది. తరతరాలుగా భూమి మీదే ఆధారపడిన రైతులు జీవితాంతం బాధపడేలా ప్రభుత్వం చేస్తోంది. ఈ ప్రభుత్వానికి రైతులంటే అభిమానం లేదు.