Kio Motors
-
‘బాబు అపద్దాలు పరాకాష్టకు చేరాయి’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపద్దాలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెనుకొండ సమన్వయ కర్త శంకర్ నారాయణ, రాప్తాడు సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పుట్టపర్తి సమన్వయ కర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కియా కారు ప్రారంభం అంటూ డ్రామాలు ఆడటము ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఎక్కడో తయారైన కారును తీసుకువచ్చి లాంచింగ్ అనడం మన దౌర్భాగ్యమన్నారు. కియా ప్రాంతంలో రైతులను ఆదుకుని, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు మోసం చేశాడని మండిపడ్డారు. మసిపూసి మారేడు కాయ చేసి అనంత ప్రజలను నిండాముంచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా పేరుతో చేసిన మోసాలు, అవినీతిపై వచ్చే నెల నాలుగవ తేదిన వైఎస్సార్ సీపీ.. ప్రజల తరపున ఉద్యమం చేపడతుందని వెల్లడించారు. రైతులకు, నిరుద్యోగులకు న్యాయం చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. -
‘కియా’ గోల్మాల్
కార్ల కంపెనీకి భూసేకరణలో మాయాజలం రూ. కోట్ల విలువైన 16 ఎకరాలు తప్పించే ఎత్తుగడ మనం చూస్తున్న ఈ భూములు కియా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి ఎదురుగా ఉన్నవి. రెండో విడత భూ స్వాధీన ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారులు సేకరిస్తున్న భూములకు ఆనుకుని ఉన్న భూములు కూడా ఇవే. అయితే విలువైన ఈ భూములను స్వాధీనం చేసుకోకుండా మినహాయింపు ఇవ్వడం వెనుక అధికారిక కుట్ర సాగుతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ భూములను స్వాధీన ప్రక్రియ నుంచి తప్పించేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు పావులు కదిపినట్లు చర్చ సాగుతోంది. పెనుకొండ: మండలంలోని అమ్మవారుపల్లిలో సర్వే 179లో హనుమంతరెడ్డికి 3.26 ఎకరాలు, శేషగిరికి 3.26 ఎకరాలు, వెంకటరెడ్డికి 9.50 ఎకరాల పట్టా భూమి ఉంది. కియా కార్ల పరిశ్రమల ఏర్పాటులో భాగంగా చేపట్టిన భూ స్వాధీన ప్రక్రియ నుంచి ఈ 16 ఎకరాలను అధికారులు తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు కథ ఏమిటంటే.. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు ప్రాంతంలో ఎకరా భూమి విలువ కనీసం రూ. కోటికి పైగా ఉంది. దీనిని బట్టి సర్వే 179లోని 16 ఎకరాల భూమి విలువ రూ. 16 కోట్ల పై మాటే. ఈ భూములపై కన్నేసిన జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు ఎకరా రూ. 30 లక్షలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మధ్యవర్తిగా రియల్టర్ రామచంద్రను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీన ప్రక్రియలో ఈ భూములు పోతే ప్రభుత్వం అందజేసే రూ. 10.50 లక్షలతోనే అమ్మకందారులు సరిపెట్టుకోవాలి. లేకపోతే అగ్రిమెంట్ మేరకు రూ. 30 లక్షలు చెల్లించేటట్లు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. భూములను అగ్రిమెంటు చేసుకున్నా.. కియా కార్ల పరిశ్రమ రెండో విడత భూసేకరణ ప్రారంభించక మునుపే ఈ భూములను అగ్రిమెంట్ చేసుకున్నాను. సిమెంటు పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు ఈ భూమిని కొనుగోలు చేశాను. దీని వెనుక ఎవ్వరి హస్తం లేదు... ఎవరికీ సంబంధం లేదు. ఈ 16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోరాదంటూ కోర్టును ఆశ్రయించాను. - రామచంద్ర, రియల్ ఎస్టేట్‌వ్యాపారి, అమ్మవారుపల్లి, పెనుకొండ మండలం విషయం తెలియదు.. ఆ 16 ఎకరాల భూమి విషయం నాకు తెలియదు. నిబంధనల మేరకు వ్యవహరిస్తాం. ఆ భూములపై విచారణ చేయిస్తాం. పారదర్శకంగా వ్యవహరించడమే మా బాధ్యత. - రామ్మూర్తి, ఆర్డీవో, పెనుకొండ -
దగా కారు!
చదును వెనుక దందా - కియా కార్ల పరిశ్రమ ముసుగులో ‘పచ్చ’తంత్రం - రూ.177.94 కోట్లతో ఎల్అండ్టీకి టెండర్ - భూముల విలువను మించి చదునుకు వ్యయం - ఓ ఎమ్మెల్యే, చినబాబుకు లబ్ధి చేకూర్చే యత్నం - పక్కా ప్రణాళికతో దోపిడీ భూసేకరణ బాధితులు గ్రామం బాధిత రైతులు అమ్మవారిపల్లి 145 దుద్దేబండ 55 కురబవాండ్లపల్లి 205 వెంకటగిరిపాలెం 15 కియా కార్ల పరిశ్రమకు కేటాయించిన భూముల చదును వెనుక దందా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. 599.35 ఎకరాలను రూ.62.93 కోట్లతో కొనుగోలు చేసిన ఏపీఐఐసీ.. ఆ భూములను చదును చేసేందుకు రూ.177.94 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. కొనుగోలుకు వెచ్చించిన మొత్తానికి మూడింతలు చదునుకు ఖర్చు చేయనుండటం వెనుక మతలబు ఉన్నట్లు ఇట్టే అర్థమవుతోంది. కేబినెట్లో చోటు ఆశించి భంగపడిన ఓ ఎమ్మెల్యేలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడం.. చినబాబును ఓ ‘ఇంటి’వాడిని చేయడమే ఈ టెండర్ సారాంశంగా తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పెనుకొండ నియోజకవర్గంలోని ఎర్రమంచి, అమ్మవారిపల్లి, దుద్దేబండ, వెంకటగిరిపాళెంలో ‘కియా’ కార్ల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఏపీఐఐసీ 599.35 ఎకరాల భూమిని సేకరించింది. బాధిత రైతులకు ఎకరాకు రూ.10.50లక్షలు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన నాలుగు గ్రామాల పరిధిలో 599.35 ఎకరాలు కోల్పోయిన రైతులకు 62.93లక్షల పరిహారం దక్కనుంది. ప్రభుత్వం సేకరించిన పొలాన్ని ‘కియా’కు అప్పగిస్తే అందులో యాజమాన్యం నిర్మాణ పనులు చేసుకోవాలి. కానీ ప్రభుత్వం పొలాలను చదునుచేసి ‘కియా’కు అప్పగించేందుకు ముందుకొచ్చింది. పొలాన్ని చదును చేసేందుకు ఈ- ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఈ పనికి ఖర్చయ్యే మొత్తాన్ని రూ.177.94కోట్లుగా నిర్ధారించింది. భూముల కొనుగోలుకు రూ.62.93కోట్లు పరిహారం చెల్లించిన ప్రభుత్వం.. చదును పేరుతో ఇంత భారీ మొత్తంలో టెండర్లు పిలవడాన్ని రైతు సంఘాలతో పాటు విపక్షాలు తప్పుబడుతున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారమే టెండర్లు చదును పనులను అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం టెండర్లలో తిరకాసు పెట్టింది. టెండర్లు దాఖలు చేసే ఏజెన్సీలు గత ఐదేళ్లలో కనీసం ఓ ఏడాది రూ.780కోట్ల టర్నోవర్‌తో పనులు చేసి ఉండాలని పేర్కొంది. ఆ మేరకు ఎల్అండ్టీ, ఎన్‌సీసీలు అర్హత సాధించాయి. ఈ రెండింటి టెండర్లలో ఫైనాన్సియల్ బిడ్‌ను పరిశీలించిన అధికారులు ఎల్అండ్టీ టెండర్‌ను ఖరారు చేశారు. నిజానికి ఈ పనులకు రూ.25కోట్లకు మించి ఖర్చు కాదని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఎలాంటి నిర్మాణాలు లేకుండా కేవలం పొలాలు చదును చేసేందుకు పెద్దగా ఖర్చు కాదు. ఈ పనుల్లో రూ.150కోట్లకు పైగా అవినీతి జరుగుతోందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎవరి వాటా ఎంతంటే! అనంతపురం జిల్లాలో మంత్రి పదవి ఆశించి భంగపడిన ఓ ఎమ్మెల్యేను సంతృప్తి పరిచేందుకు టెండర్ మొత్తంలో రూ.30కోట్లు నిర్మాణ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో రూ.30–40కోట్లతో అమరావతిలో ఓ భవంతిని చినబాబుకు నిర్మించి ఇచ్చేలా కూడా ఒప్పందం జరిగినట్లు చర్చ జరుగుతోంది. రెండిటికీ రూ.60–రూ.70కోట్లు ఖర్చవుతుంది. ఇది కాకుండా పనులకయ్యే రూ.25కోట్ల ఖర్చు పోనూ మరో రూ.80–రూ.90 కోట్లు నిర్మాణ సంస్థకు మిగలనుంది. ప్రస్తుతం ఎల్అండ్టీ సంస్థ పనులు చేస్తోంది. నాలుగు చోట్ల చిన్న చిన్న గుట్టలు తప్ప మొత్తం పొలం చదునుగానే ఉంది. ఈ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని చూస్తున్న భూములు కోల్పోయిన రైతులు చదును పేరుతో జరిగే దోపిడీని తెలుసుకుని అవాక్కవుతున్నారు. తమకు తక్కువ మొత్తాన్ని పరిహారంగా చెల్లించి.. చదును పేరుతో ప్రభుత్వం టీడీపీ నేతలకు దోచిపెడుతుండటం పట్ల మండిపడుతున్నారు. -
మళ్లీ టెన్షన్..!
- 5 వేల ఎకరాల భూసేకరణకు రంగం సిద్ధం - ఆందోళనలో అన్నదాతలు పెనుకొండ: కియాకార్ల పరిశ్రమ కోసం పెనుకొండ మండలం ఎర్రమంచి, అమ్మవారుపల్లి పొలాల్లో మొదట విడతలో 193 మంది రైతుల నుంచి 600 ఎకరాలు భూమిని సేకరించారు. ఈ ప్రాంతంలో కార్ల పరిశ్రమ పనులు జరుగుతుండగా... ఏకంగా మరో 5 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎమ్మెల్యే బీకే సార్థసారధే ఈ విషయాన్ని చెప్పారు. సీఎం దీనికి ఆమోద ముద్ర వేశారని, రైతులందరూ సహకరించాలంటున్నారు. ఇప్పటికే భూసేకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం నుంచి గొందిపల్లి సమీపంలో ఉన్న భూములతో పాటు ఆ ప్రాంతంలోని మిగిలిన భూములు రాంపురం గ్రామ వెనుక భాగంలో అంటే ఎర్రమంచి , మోట్రుపల్లి, చినపరెడ్డిపల్లి ప్రాంతాలకు చెందిన భూములన్నీ భూసేకరణకు వెళ్ళనున్నాయని ఎమ్మెల్యే మాటలు చెప్పకనే చెబుతున్నాయి. ఇక గుట్టూరు ప్రాంతంలో సైతం విలువైన భూములను ప్రభుత్వం సేకరించనున్నట్లు తెలుస్తోంది. సోమందేపల్లి మండలంలో సైతం పలు ప్రాంతాల్లో విలువైన భూములను సేకరించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కియా చదును పనులు ఆగస్టులోగా పూర్తీ కానుండటంతో 2వ విడత పనులు ఊపందుకోనున్నాయి. రైతుల్లో ఆందోళన.. ఉన్న భూములన్నీ పోతే ఏం చేయాలన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. కియా కార్ల కంపెనీ కోసం ప్రస్తుతమున్న భూమిని చదును చేసేందుకు ఎకరాకు ఏకంగా రూ. 29.74లక్షలతో రూ. 177 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేయిస్తోంది. ఇందులో భారీ స్కాం దాగి ఉందనే విమర్శలు వస్తున్నా అదే తరహాలో మరోసారి భారీ భూసేకరణ, చదును పనులతో మరో దోపిడీకి తెరతీసేందుకు సిద్ధమవుతోందన్న ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న టీడీపీ పెద్దల భూములను ప్రభుత్వం సేకరిస్తుందా? లేక సామాన్య రైతుల భూములను మాత్రమే తీసుకుంటుందా? అన్న చర్చ సైతం జోరుగా సాగుతోంది. రిజర్వాయర్ నిండుతుందా? గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో రైతులకు మేలు జరుగుతుందని రైతులు కలలు గంటున్న తరుణంలో భూసేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిపై వ్యతిరేకత వచ్చినా భూసేకరణ చేపట్టింది. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సైతం దీనికి తీవ్రంగా ఖండించారు. అమ్మవారుపల్లిలో సభ నిర్వహించి రైతులకు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. అప్పట్లో వెనక్కి తగ్గిన ప్రభుత్వం మరోసారి భారీ భూసేకరణకు సిద్ధమవడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా రిజర్వాయర్‌ను తూతూ మంత్రంగా నీటితో నింపి కియా యాజమాన్యాన్ని నమ్మించిన ప్రభుత్వం అనంతరం నీటిని గొల్లపల్లి రిజర్వాయర్‌కు వదలకుండా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి వస్తున్న నీటిని నేరుగా ఇతర ప్రాంతాలకు ఇష్టారాజ్యంగా వదుతున్నారు. రొద్దం ప్రాంతంలో భారీ భూసేకరణ రొద్దం మండలంలో సైతం ప్రభుత్వం భారీ భూసేకరణకు సిధ్ధమైంది. ఇందులో భాగంగా ప్రారంభంలో బొక్కసంపల్లి వద్ద ఉన్న భూములను సేకరించనున్నట్లు ఎమ్మెల్యే బీకే పార్ధసారధి చెబుతున్నారు. అనంతరం చుట్టు పక్కల పున్న గ్రామాల భూములను సైతం ప్రభుత్వం సేకరించనున్నట్లు చర్చ నడుస్తోంది. కమీషన్ల కోసమే... - శ్రీకాంతరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ 5 వేల ఎకరాల భూసేరణ అంటే ప్రతి రైతు భయపడే చర్య ఇది. రిజర్వాయర్ పనులను ఆఘమేఘాల మీద చేపట్టిన ప్రభుత్వం రైతుల భూములను తీసుకుని కమీషన్ల దందాకు పాల్పడాలన్న ఉద్ధేశ్యం బయట పడుతోంది . అంతా పథకం ప్రకారమే.. - వెంకటప్ప, మునిమడుగు ప్రభుత్వం పథకం ప్రకారం భూములను తీసుకుంటోంది. తరతరాలుగా భూమి మీదే ఆధారపడిన రైతులు జీవితాంతం బాధపడేలా ప్రభుత్వం చేస్తోంది. ఈ ప్రభుత్వానికి రైతులంటే అభిమానం లేదు. -
‘కియా’ పనులు వేగవంతం చేయండి : కలెక్టర్
అనంతపురం అర్బన్ : కియా పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. గురువారం ఆయన కియా పరిశ్రమ ఏర్పాట్ల పురోగతిపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, కియా మోటర్ల సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. పరిశ్రమకు అవసరమైన 599 ఎకరాల భూమిని ఆ పరిశ్రమకు బదలాయించాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. శిక్షణా కేంద్రం, టౌన్‌షిప్‌కు తాత్కాలిక ప్రాతిపదికన విద్యుత్, నీటి సరఫరా, రోడ్ల విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అదే విధంగా శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు నివేదిక అందజేయాలని ట్రాన్స్‌కో ఎస్ఈని ఆదేశించారు. సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. కియా ప్రతినిధులు, ఇంజనీర్లకు తాత్కాలిక కార్యాలయం, విడిది ఏర్పాటు చేసేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న భవనాలను కేటాయిస్తున్నామని, సమావేశ మందిరానికి కూడా అనుమతి ఇస్తున్నామన్నారు. గుడిపల్లి వద్ద ఆర్ఓబీ నిర్మించేందుకు స్థల సేకరణ, అంచనా వివరాలతో నివేదిక రూపొందించి అందజేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో పద్ధతిపై మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జేసీ టి.కె.రమామణి, పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్‌బాబు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రఘునాథ్, పెనుకొండ ఆర్డీఓ రామ్మూర్తి, ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి, కియా మోటర్స్ వైస్ ప్రెసిడెంట్ హువాన్ జిన్, డైరెక్టర్ కిమ్, ప్రతినిధులు జూడ్, పార్క్ తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 1 నుంచి ‘కియో’ పనులు
పెనుకొండ రూరల్ : దక్షిణ కొరియాకు చెందిన కియో కార్ల కంపెనీ జూన్ 1 నుంచి పనులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని అమ్మవారుపల్లి సమీపంలో పరిశ్రమలకు చెందిన 599.38 ఎకరాల భూములను కియో ప్రతినిధులు కిమ్, హవాన్, జిన్, లీ తో కలిసి పరిశీలించారు. దుద్దేబండ క్రాస్ సమీపంలోని టూరిజం గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ త్వరలో పనులు ప్రారంభించనున్నామని, విద్యుత్, నీటి సమస్య, ఇంజనీర్లు ఉండేందుకు గదులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో రామమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిజవహర్‌లాల్ నాయక్, ఇరిగేషన్ ఎస్ఈ సుబ్బరాయుడు, డీపీఓ జగదీశ్వరమ్మ ఉన్నారు.