‘కియా’ గోల్‌మాల్
కార్ల కంపెనీకి భూసేకరణలో మాయాజలం
రూ. కోట్ల విలువైన 16 ఎకరాలు తప్పించే ఎత్తుగడ
మనం చూస్తున్న ఈ భూములు కియా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి ఎదురుగా ఉన్నవి. రెండో విడత భూ స్వాధీన ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారులు సేకరిస్తున్న భూములకు ఆనుకుని ఉన్న భూములు కూడా ఇవే. అయితే విలువైన ఈ భూములను స్వాధీనం చేసుకోకుండా మినహాయింపు ఇవ్వడం వెనుక అధికారిక కుట్ర సాగుతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ భూములను స్వాధీన ప్రక్రియ నుంచి తప్పించేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు పావులు కదిపినట్లు చర్చ సాగుతోంది.
పెనుకొండ: మండలంలోని అమ్మవారుపల్లిలో సర్వే 179లో హనుమంతరెడ్డికి 3.26 ఎకరాలు, శేషగిరికి 3.26 ఎకరాలు, వెంకటరెడ్డికి 9.50 ఎకరాల పట్టా భూమి ఉంది. కియా కార్ల పరిశ్రమల ఏర్పాటులో భాగంగా చేపట్టిన భూ స్వాధీన ప్రక్రియ నుంచి ఈ 16 ఎకరాలను అధికారులు తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అసలు కథ ఏమిటంటే..
కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు ప్రాంతంలో ఎకరా భూమి విలువ కనీసం రూ. కోటికి పైగా ఉంది. దీనిని బట్టి సర్వే 179లోని 16 ఎకరాల భూమి విలువ రూ. 16 కోట్ల పై మాటే. ఈ భూములపై కన్నేసిన జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు ఎకరా రూ. 30 లక్షలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మధ్యవర్తిగా రియల్టర్ రామచంద్రను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీన ప్రక్రియలో ఈ భూములు పోతే ప్రభుత్వం అందజేసే రూ. 10.50 లక్షలతోనే అమ్మకందారులు సరిపెట్టుకోవాలి. లేకపోతే అగ్రిమెంట్ మేరకు రూ. 30 లక్షలు చెల్లించేటట్లు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
భూములను అగ్రిమెంటు చేసుకున్నా..
కియా కార్ల పరిశ్రమ రెండో విడత భూసేకరణ ప్రారంభించక మునుపే ఈ భూములను అగ్రిమెంట్ చేసుకున్నాను. సిమెంటు పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు ఈ భూమిని కొనుగోలు చేశాను. దీని వెనుక ఎవ్వరి హస్తం లేదు... ఎవరికీ సంబంధం లేదు. ఈ 16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోరాదంటూ కోర్టును ఆశ్రయించాను.
- రామచంద్ర, రియల్ ఎస్టేట్‌వ్యాపారి, అమ్మవారుపల్లి, పెనుకొండ మండలం
విషయం తెలియదు..
ఆ 16 ఎకరాల భూమి విషయం నాకు తెలియదు. నిబంధనల మేరకు వ్యవహరిస్తాం. ఆ భూములపై విచారణ చేయిస్తాం. పారదర్శకంగా వ్యవహరించడమే మా బాధ్యత.
- రామ్మూర్తి, ఆర్డీవో, పెనుకొండ