
గ్రేటర్‌లో 6.3 లక్షల ఓట్లు తొలగింపు
► తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
► ఓటర్ల సవరణను సద్వినియోగం చేసుకోండి.. తప్పులుంటే మార్చుకోండి
► నవంబర్ 4 వరకు ఓటర్ల సవరణ.. కొత్త ఓటర్లకు అవకాశం
► నియోజకవర్గాలవారీగా ముసాయిదా జాబితాల ప్రచురణ
► తెలంగాణలో 2.54 కోట్ల మంది, ఏపీలో 3.51 కోట్ల మంది ఓటర్లు
► ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాల సవరణ.. కొత్త ఓటర్ల నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి మొదలైన ఈ ప్రక్రియ వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. షెడ్యూలు ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రచురించినట్లు చెప్పారు. తెలంగాణలో 2.54 కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 3.51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. 2016 జనవరి 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండే వారందరూ కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారని తెలిపారు.
కొత్త ఓటర్లతో పాటు ఇప్పటివరకు ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జాబితాల్లో ఉన్న ఓటర్లు తమ పేర్లు, చిరునామాల్లో మార్పులుంటే సవరించుకోవాలన్నారు. ఓటర్లు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించే వీలుందని, రెవెన్యూ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు అందించవచ్చని చెప్పారు. ఖాళీగా ఉన్న వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలోని నియోజకవర్గాలు, నారాయణ్‌ఖేఢ్ నియోజకవర్గంలోనూ ఓటర్ల సవరణకు వీలుందన్నారు. నోటిఫికేషన్ వచ్చేలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలను పంపాలని కోరిందని, 3 రోజుల్లో పంపుతామని చెప్పారు.
గ్రేటర్‌లో 6.3 లక్షల ఓట్లు తొలగింపు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన ఇంటింటి సర్వే ఆధారంగా 6.3 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లు భన్వర్‌లాల్ చెప్పారు. వీరితో పాటు మరో 19 లక్షల మంది ఓటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ జాబితాలను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించామని, ఈ నెల 8 నుంచి ఇంటింటి సర్వే చేపట్టి వీటిని పరిశీలిస్తామన్నారు. పార్టీల తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను పంపించాలని కోరామని.. వారు సహకరిస్తే ఓట్ల తొలగింపుతో పాటు అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతవకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్పారు. అకారణంగా ఓటర్లను జాబితాలో నుంచి తొలగించినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఓటర్ల జాబితాల్లో తమ పేరు తొలిగించినట్లు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని.. వారి పేర్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు.
రెండు రోజుల్లో ప్రత్యేక సవరణ
ఈ నెల 11, నవంబర్ 1న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్ల సవరణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల్లోనే బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని.. అక్కడే దరఖాస్తులు సమర్పించే వీలు కల్పించినట్లు చెప్పారు. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయా.. లేదా తెలుసుకునేందుకు వీలుగా పంచాయతీ కార్యాలయాలు, మండల రెవెన్యూ కార్యాలయం, డివిజన్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 8790499899 ఫోన్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపి ఓటు వివరాలను తెలుసుకునే వీలుందన్నారు. ఓట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తమ గుర్తింపు కార్డు నంబర్‌ను.. ఈ నంబర్‌కు పంపిస్తే క్షణాల్లోనే వివరాలు అందుతాయన్నారు.
ఓటర్ల జాబితాల్లో అవకతవకలు
భన్వర్‌లాల్‌కు అఖిలపక్షం ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 6.30 లక్షల ఓట్లను తొలగించారని, మరో 19 లక్షల ఓటర్లకు నోటీసులు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. బతికి ఉన్న వారిని సైతం చనిపోయినట్లుగా చూపించి ఓట్లను గల్లంతు చేశారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ టీఆర్‌ఎస్ పార్టీకి ఏజెంట్‌గా మారారని, తప్పులకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించినట్లుగా భన్వర్‌లాల్ దృష్టికి తెచ్చారు. ఓటర్ల సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ తరఫున మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి, ఎంఐఎం నుంచి జాఫ్రీ, టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ నుంచి కె.శివకుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేశంలోనే నిజామాబాద్ నంబర్‌వన్
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నందున ఓటర్ల నమోదుకు, సవరణకు ఆధార్‌తో సంబంధం లేదని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఆధార్ సీడింగ్ నూటికి నూరు శాతం పూర్తయిందని భన్వల్‌లాల్ చెప్పారు. దేశంలోనే ఆధార్ సీడింగ్ పూర్తి చేసిన మొదటి జిల్లా నిజామాబాద్ అని తెలిపారు.