అమ్మా లేమ్మా.. నీళ్లు తాగమ్మా.. | 6 died, 20 injured in road accident, Marriage Van turned | Sakshi
Sakshi News home page

అమ్మా లేమ్మా.. నీళ్లు తాగమ్మా..

Published Thu, Mar 31 2016 2:40 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

అమ్మా లేమ్మా.. నీళ్లు తాగమ్మా.. - Sakshi

అమ్మా లేమ్మా.. నీళ్లు తాగమ్మా..

పెళ్లి వేళ.. మృత్యు హేల
వివాహానికి వెళ్తున్న వ్యాన్ బోల్తా.. ఏడుగురి దుర్మరణం
20 మందికి గాయాలు..  ఆరుగురి పరిస్థితి విషమం
రంగారెడ్డి జిల్లా పరిగి వద్ద ఘటన
డ్రైవర్ మత్తుకు నిండు ప్రాణాలు బలి
డ్రైవర్‌కు లెసైన్స్ కూడా లేదు
తప్పతాగి నడపడంతోనే ప్రమాదం
విషయం దాచి పెళ్లి జరిపించిన పెద్దలు
పెళ్లయ్యాక ప్రమాదం గురించి తెలిసి బోరుమన్న వధూవరులు


 
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/పరిగి/కొందుర్గు: కాసేపట్లో పెళ్లి వేడుక.. అందరి ముఖాల్లో సంతోషం.. చిన్నారుల కేరింతలతో ఒకటే సందడి.. చిన్నాపెద్దా అంతా కలసి సంబరంగా వ్యాన్ ఎక్కారు.. కానీ బయల్దేరిన కాసేపటికే ఆ వాహనం మృత్యుకోరలకు చిక్కింది..! డ్రైవర్  ‘మత్తు’ ఏడుగురి నిండు ప్రాణాలను బలిగొంది!! పెళ్లికి చేరాల్సిన వారంతా మార్గం మధ్యలోనే పెను విషాదంలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ పూటుగా తాగి వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలుకాగా.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
 
 బయల్దేరిన కాసేపటికే..
 వికారాబాద్ మండలం ద్యాచారం గ్రామానికి చెందిన అంజయ్య కూతురు శివలీలకు మహబూబ్‌నగ ర్ జిల్లా కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లికి చెందిన రామరాజుతో పెళ్లి కుదిరింది. బుధవారం ఉదయం 10 గంటలకు వరుడి ఊరిలో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కూతురితో పాటు ఆమె తల్లిదండ్రులు మంగళవారం రాత్రే ఉత్తరాసిపల్లికి వెళ్లారు. మిగతా కుటుంబీకులు, బంధువులు దాదాపు 50 మంది డీసీఎం వ్యాన్‌లో బుధవారం ఉదయం 8.30కు ద్యాచారం నుంచి బయలుదేరారు. సయ్యద్‌పల్లికి చెందిన పొట్టిగారి సైదప్పను డ్రైవర్‌గా కుదుర్చుకున్నారు.
 
 ఆటో నడుపుతూ పొట్టబోసుకునే ఇతడికి డ్రైవింగ్ లెసైన్స్ కూడా లేదు. ఇటీవలే సొంతూరిలో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి చేతిపంపును ఢీకొట్టాడు. పెళ్లి బృందాన్ని ఎక్కించుకోవడానికి ముందే ఇతడు మద్యం తాగాడు. ఇదే  నిషాలో వాహనాన్ని ఇష్టానుసారంగా నడిపాడు. దారిలో అటుఇటుగా స్టీరింగ్‌ను తిప్పడంతో భయభ్రాంతులకు గురైన పెళ్లివారు అతడిపై కేకలు వేశారు. అయినా అవేవీ పట్టించుకోకుండా వాహనాన్ని మరింత వేగంగా నడిపాడు. దీంతో ఉదయం 10 గంటలకు వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనంలోంచి దూకి పరారయ్యాడు.
 
 ఘటనాస్థలంలో హాహాకారాలు..
 ప్రమాదం అనంతరం క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ప్రమాద స్థలం పరిగికి సరిగ్గా కిలోమీటరు దూరంలో ఉంది. ప్రయాణికులు ఫోన్ చేయడంతో స్థానిక సీఐ, ఎస్సైలు చేరుకొని బస్సులు, అంబులెన్సులు, ఆటోలు.. ఏది అందుబాటులో ఉంటే అందులో క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో రాజు అనే తొమ్మిదేళ్ల బాలుడి కుడి చేయి తెగిపడింది. ఆ చేతిని పట్టుకొని బంధువులు తొలుత షాదాన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
 
 మృతులు వీరే..
 ఘటనా స్థలంలోనే దోమ మండలం ఐనాపూర్‌కు చెందిన లక్ష్మి(35), చేవెళ్ల మండలం కుమ్మెరకు చెందిన అనసూయ (32) మృతి చెందారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వికారాబాద్ మండలం కామారెడ్డిగూడకు చెందిన మన్నె మాణెయ్య(62), ద్యాచారానికి చెందిన నవీన్‌కుమార్(25) చనిపోయారు. మిగతా క్షతగాత్రులను హైదరాబాద్‌లోని షాదాన్, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. అక్కడ ద్యాచారం గ్రామానికి చెందిన బోయిన బుచ్చయ్య(60)తోపాటు అదే గ్రామానికి చెందిన శరణ్య(18), ధారూరు మండలం అంతారం నివాసి కావలి బుచ్చయ్య(75) మృతి చెందారు.
 
 సీఎం దిగ్భ్రాంతి
 రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, పరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, చేవె ళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవ్‌రావు తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా 50 వేల రూపాయలు, గాయపడిన వారికి 10 వేల రూపాయలు అందజేయాలని మంత్రి మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఆదేశించారు.
 
 అమ్మా లేమ్మా.. నీళ్లు తాగమ్మా..
 అమ్మా.. లేమ్మా.. నీళ్లు తాగమ్మా.. లేచి మాట్లాడమ్మా.. అంటూ ఈ ఇద్దరు చిన్నారులు అపస్మారకస్థితిలో ఉన్న తమ తల్లి వద్ద రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాదంలో అక్కమ్మ(33) అనే మహిళ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఆమెను అంబులెన్సులో తీసుకువచ్చి పరిగి ఆస్పత్రి ఆవరణలో పడుకోబెట్టారు. క్షతగాత్రురాలి కొడుకు (రెండున్నరేళ్లు), కూతురు(4)కూ గాయాలయ్యాయి. తల్లికి ఏమైందో తెలియని.. ఆ చిన్నారులు ఆమె తల దగ్గర కూర్చుని ఏడవసాగారు. కొందరు వాటర్ ప్యాకెట్లు తీసుకొచ్చి చిన్నారులకు ఇచ్చారు. వారు నీటిని తాగుతూ.. ‘అమ్మా.. నువ్వూ తాగమ్మా..’ అంటూ త ల్లిని బతిమాలడం అందరినీ కలచివేసింది. అనంతరం అక్కమ్మను మెరుగైన  చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
 
వెలవెలబోయిన పెళ్లి పందిరి
ఈ ప్రమాదంతో ఉత్తరాసిపల్లిలో వరుడి ఇంట బంధువులు, బాజాబజంత్రీలతో కళకళలాడాల్సిన పెళ్లి పందిరి వెలవెలబోయింది. ఎవరి మొహం చూసిన విషాదమే కనిపించింది. పెళ్లి నిలిచిపోవద్దన్న ఉద్దేశంతో పెద్దలు ప్రమాదం విషయం దాచి పెళ్లి జరిపించారు. పెళ్లయ్యాక నూతన వధూవరులకు ప్రమాదం సంగతి చెప్పడంతో వారు బోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement