
వృద్ధరాలి దారుణ హత్య
అద్దె ఇంటి కోసం వచ్చి హత్యచేసిన దుండగుడు
మూడు తులాల బంగారు గొలుసుతో పరారీ
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, క్లూస్‌టీం
కోదాడ : పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. సోమవారం పట్టపగలు చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. బాలాజీనగర్‌కు చెందిన చిల్లంచర్ల అనసూర్యమ్మ (70) భర్త పాండురంగారావుతో కలిసి అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో ముగ్గరు వేరే ప్రదేశంలో ఉంటుండగా మరో కుమారుడు ఇదే గ్రామంలో వేరుగా ఉంటున్నాడు. వృద్ధ దంపతులు మాత్రమే కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం ఓ అపరిచిత యువకుడు అద్దెకు ఇల్లు కావాలని అనసూర్యమ్మ ఇంటికి వచ్చాడు. ముందు గది ఖాళీగా ఉండడంతో అద్దెకు ఇవ్వడానికి వృద్ధ దంపతులు అతనికి గదిని చూపించారు. గది అద్దె మాట్లాడుకుని సోమవారం మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అన్న ప్రకారం సోమవారం సదరు యువకుడు మధ్యాహ్నం వచ్చాడు. అద్దెకు తీసుకున్న గదిని కడుక్కున్నాడు. అనసూర్యమ్మతో ముచ్చట్లు పెట్టసాగాడు. గంటల తరబడి అతను మాట్లాడుతుండడంతో విసుగుపుట్టిన పాండురంగారావు ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. సాయంత్రం 4.30 గంటలకు నిద్ర లేచిన పాండురంగారావు అనసూర్యమ్మ కనపడకపోవడంతో అద్దెకు ఇచ్చే గదిలోకి వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో పడిఉంది. అతను కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడడంతో అప్పటికే అనసూర్యమ్మ మరణించింది. ఆమె మెడలో ఉండాల్సి మూడు తులాల బంగారపు గొలుసు లేదు. దుండగుడు దాని కోసమే ఆమెను మాటల్లో పెట్టి వెనుక నుంచి తలపై కర్రతో బలంగా కొట్టడంతో ఆమె మరణించినట్లు భావిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ సీఐ రజితారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికుని చేరుకొని పరిసరాలను పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ రప్పించి వివరాలు సేకరించారు. సూర్యాపేట డీఎస్పీ సునీత రాత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.