టీడీపీ ఎమ్మెల్యే సన్నిహితురాలి దౌర్జన్యం
విజయవాడ (సత్యనారాయణపురం): విజయవాడలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సన్నిహితురాలు, పోలీస్ కానిస్టేబుల్, సెక్యూరిటీ గార్డులు కలసి ఒక మహిళపై దాడిచేసి దారుణంగా కొట్టారు. దీనిపై బాధితులు సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఎమ్మెల్యే అనుచరులు సెటిల్‌మెంట్ పేరుతో బెదిరించటమేగాక కౌంటర్ కేసు నమోదు చేయించారు. బాధితుల కథనం మేరకు.. స్థానిక బావాజీపేట రెండో లైన్‌లో ఎమ్మెల్యేకు సన్నిహితురాలైన మహిళ శోభారాణి నివసిస్తోంది.
ఆమె కారు డ్రైవర్‌గా పనిచేసిన బొందలపాటి శ్రీనివాసరావుకు ఇద్దరు భార్యలున్నారు. బొందలపాటి సత్యవతి మొదటి భార్య. రెండో భార్యకు ముగ్గురు కుమార్తెలు. కొంతకాలంగా భార్యలకు దూరంగా ఉంటున్న శ్రీనివాసరావు తన పిల్లల్ని శోభారాణి వద్ద ఉంచాడు. పిల్లల్లో ఇద్దరు చదువుకుంటుండగా, మరో కుమార్తె అవంతిక (14)తో శోభారాణి ఇంట్లో పనిచేయిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అవంతిక ఫోను చేయడంతో సత్యవతి, ఆమె కుమారుడు శోభారాణి ఇంటికి వచ్చి అవంతికను తమతో పంపాలని కోరారు.
శోభారాణి తిరస్కరించారు. వీధిలోకి వెళ్లిన సత్యవతిని, ఆమె కుమారుడిని కానిస్టేబుల్ గోవిందరాజులు శోభారాణి ఇంట్లోకి తీసుకెళ్లి సెక్యూరిటీ గార్డుతో కలసి తీవ్రంగా కొట్టారు. గాయపడిన సత్యవతి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గాంధీనగర్‌కు చెందిన ఓ టీడీపీ నాయకుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాజీ పడదామంటూ రాయబేరాలు సాగించాడు. దీనికి సత్యవతి అంగీకరించకపోవడంతో అవంతికతో బాధితులపై కౌంటర్ కేసు పెట్టించాడు. వచ్చినవాళ్లు తనకు తెలియదని, తనను దౌర్జన్యంగా తీసుకెళ్లాలని చూశారని అవంతిక తెలిపింది.