హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం ప్రక్రియను నిలిపేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఈనెల 15లోగా ఓటర్లందరూ ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. బోగస్ ఓటర్ల ఏరివేసేందుకు ఆయన ఈ ప్రక్రియ ప్రారంభించారు.
అయితే, ప్రభుత్వ పథకాలకు ఆధార్తో ముడి పెట్టొద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో.. ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించాలన్న ఎన్నికల కమిషన్ ప్రాజెక్టుకు గండిపడింది. వేర్వేరు రాష్ట్రాలు లేదా వేర్వేరు ప్రాంతాల్లో ఓటుహక్కు కలిగి ఉండేవారిని గుర్తించి, అలాంటి వాటిని ఏరివేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు అర్ధంతరంగా ఆగింది. తక్షణం ఈ ప్రక్రియను నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ నుంచి అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే భన్వర్ లాల్ తాజా ఆదేశాలు జారీ చేశారు.
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'
Published Fri, Aug 14 2015 9:46 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement