
నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు
డిసెంబర్ 8 వరకు అవకాశం
రెండు రాష్ట్రాల్లోను ఆన్‌లైన్‌లో ఈ రిజిస్ట్రేషన్లు
‘సాక్షి’తో రెండు రాష్ట్రాల సీఈఓ భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో గురువారం నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదుకు అర్హులని చెప్పారు. డిసెంబర్ 8వ తేదీ వరకు ఓటర్లగా నమోదుకు, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్లు నియోజకవర్గాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రకటిస్తారని, ఆ జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా ఇస్తారని వివరించారు. ఓటర్ల నమోదు కార్యక్రమం నేపథ్యంలో భన్వర్‌లాల్ బుధవారం సచివాలయంలో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు.
రెండు రాష్ట్రాల్లో కూడా ఆన్‌లైన్‌లో ఇ-రిజస్ట్రేషన్ ద్వారా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించామన్నారు. సీఈఓ ఆంధ్రా, సీఈఓ తెలంగాణ వెబ్ సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో ఓటర్లు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఇప్పటివరకు ఓటర్లుగా నమోదు దరఖాస్తు చేసుకున్న వారితోపాటు గురువారం నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరి పేర్లను వచ్చే ఏడాది జవనరి 15వ తేదీ కల్లా పరిష్కారం పూర్తి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఓటర్ల తుది జాబితాను కూడా వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన ప్రకటిస్తామన్నారు.
ఓటర్ల నమోదు కార్యక్రమం, జాబితాలో సవరణలను పర్యవేక్షించేందుకు రెండు రాష్ట్రాలకు కలిపి తొమ్మిదిమంది ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు తెలిపారు. కొత్తగా నమోదైన ఓటర్లందరికీ జనవరి 25వ తేదీ నుంచి కలర్ ఫొటోతో కూడిన స్మార్ట్ గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోను ఓటర్ల జాబితాల నుంచి డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఆధార్ అనుసంధానం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోను, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గురువారం నుంచి ఓటర్ల జాబితాల్లోని పేర్లకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆధార్ నెంబర్ల అనుసంధానం పూర్తి చేయగా పది శాతం మేర డూప్లికేట్ ఓటర్లున్నట్లు తేలిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 80 లక్షల ఓటర్లలో 8 లక్షలు ఓటర్లు డూప్లికేట్ ఉంటాయని తెలిపారు. ప్రయోగాత్మకంగా చేపట్టే ఆధార్ అనుసంధానం ఫలితాలు ఆధారంగా వచ్చే ఏడాదికల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటర్లందరికీ ఆధార్ నెంబర్ అనుసంధానం ద్వారా డూప్లికేట్ ఓటర్లను జాబితాల నుంచి తొలగిస్తామని ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల నమోదుకు పరిశీలకులగా జిల్లాల వారీగా నియమించిన ఐఏఎస్ అధికారులు: ఎం. జగదీశ్వర్ (నల్గొండ, మహబూబ్‌నగర్), బి.ఎం.డి. ఎక్కా (వరంగల్, ఖమ్మం), బి.వెంకటేశం (కరీంనగర్, ఆదిలాబాద్), ఎల్. శశిధర్ (మెదక్, నిజామాబాద్), అనితా రాజేంద్ర (హైదరాబాద్, రంగారెడ్డి).
ఏపీలో ఓటర్ల నమోదుకు పరిశీలకులుగా నియమించిన ఐఏఎస్ అధికారులు: కె. మధుసూధనరావు (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం), జయేశ్ రంజన్ (తూర్పూ, పశ్చిమ గోదావరి, కడప), బి. ఉదయలక్ష్మి ( నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు), వి. ఉషారాణి (కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం).
ఓటర్ల నమోదు, జాబితా సవరణ షెడ్యూల్..
ముసాయిదా జాబితా ప్రకటన :13-11-2014
ఓటర్లగా నమోదు, అభ్యంతరాలు, సవరణలు : 13-11-2014 నుంచి 08-12-2014
గ్రామసభల్లో, స్థానిక సంస్థల్లో పేర్లు చదివేది : 19-11-2014, మరియు 26-11-2014
పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఆఫీసర్లు, పార్టీల ఏజెంట్లు కూర్చుని దరఖాస్తులు స్వీకరణ :
16-11-2014, 23-11-2014, 30-11-2014, 07-12-2014
దరఖాస్తుల పరిష్కారం : 22-12-2014
సప్లిమెంటరీ జాబితా ప్రచురణ,ఫొటోలు, పేర్లు నమోదు : 05-01-2015
ఓటర్ల తుది జాబితా ప్రకటన: 15-01-2015