మున్సిపల్‌ స్థలం అన్యాక్రాంతం | aakramana, madanapalli | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ స్థలం అన్యాక్రాంతం

Published Thu, Sep 8 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

తూర్పుకొత్తపేటలో రిజిష్టర్‌ కాబడిన మున్సిపల్‌ స్థలం(ఫైల్‌)

తూర్పుకొత్తపేటలో రిజిష్టర్‌ కాబడిన మున్సిపల్‌ స్థలం(ఫైల్‌)

– రూ. 2 కోట్ల ఆస్తి పరులపాలు 
– తూతూ మంత్రంగా అధికారుల చర్యలు
– రిజిస్ట్రేషన్‌ రద్దు కాకుండా అధికార పార్టీ ప్రయత్నం
– సబ్‌ రిజిస్ట్రార్‌పై సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు
మదనపల్లె : పురపాలక సంఘ స్థలం అన్యాక్రాంతమైంది. గత నెల 18వ తేదీ స్థానిక తూర్పుకొత్తపేటలోని దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువజేసే పురపాలక సంఘం ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సాక్షి కథనం, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల చొరవతో అధికార పార్టీ నాయకుల అక్రమాలు బయటపడినా ఫలితం లేకపోతోంది. ఈ కబ్జా భాగోతంపై మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కౌన్సిలర్లు గళం విప్పడంతో ఖంగుతిన్న మున్సిపల్‌ అధికారులు ఆ స్థలాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కోదండరామయ్యతో చర్చించారు. వెంటనే ఆ రిజిస్ట్రేషన్‌ రద్దుచేయాలని కోరారు. రిజిస్టర్‌ చేసిన వారు చేయించుకున్న వారు వస్తే రద్దుచేయవచ్చని చెప్పారు. స్థలం రిజిస్ట్రేషన్‌ విషయమై కౌన్సిల్‌ సమావేశంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ప్రస్తావించగా, చైర్మన్, కమిషనర్‌ వెంటనే ఆ స్థలం మున్సిపాలిటీకి చెందినదిగా బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారేకానీ ఇప్పటివరకూ బోర్డు పెట్టకపోవడం గమనార్హం. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధే కుట్రపన్నుతున్నారని తెలుస్తోంది. 
రిజిస్ట్రేషన్‌ రద్దు కాకుండా అధికార పార్టీ ప్రయత్నం 
రిజిస్టర్‌ చేసిన వారు, చేయించుకున్న వారు ఆ ప్రజాప్రతినిధి అనుచరులే. ఈ స్థలంపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఒకవేళ ప్రతిపక్షం, మీడియా ఒత్తిళ్లవల్ల తీసుకున్నా అవి నామమాత్రంగానే ఉండాలని అధికారులకు సూచనలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఈ స్థలాన్ని ఎలాగైనా సరే పరిరక్షిస్తామని శపథం చేస్తున్నారేగానీ అందుకు చేపట్టాల్సిన చర్యలు మాత్రం శూన్యమనే విమర్శలు వస్తున్నాయి.
సబ్‌ రిజిస్ట్రార్‌పై సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు 
స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కోదండరామయ్యపై సబ్‌ కలెక్టర్‌ కృతికాబాత్రకు మున్సిపల్‌ కమిషనర్‌ ఫిర్యాదు చేశారు.  మున్సిపల్‌ స్థలాన్ని రిజిస్టర్‌ చేశారని, వెంటనే రద్దుచేయించేలా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్‌ స్థలాల వివరాలు ఇవ్వలేదు..
మున్సిపల్‌ స్థలాలకు సంబంధించిన వివరాలు ఇప్పటివరకూ ఇవ్వలేదని స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కోదండరామయ్య అన్నారు. మున్సిపల్‌ స్థలం రిజిస్ట్రేషన్‌పై ఆయనను వివరణ కోరగా, తమ వద్దకు పక్కా డాక్యుమెంట్లతో రావడంతోనే రిజిస్టర్‌ చేశామని చెప్పారు.  పట్టణంలో ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని, అయితే మున్సిపల్‌ స్థలాల వివరాలను ఇప్పటివరకూ తమకు ఇవ్వలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement